English | Telugu
ఫ్లాప్ డైరెక్టర్స్ కు అచ్చొస్తున్న పొలిశెట్టి.. లిస్ట్ లో నెక్స్ట్ ఎవరు?
Updated : Sep 11, 2023
టాలీవుడ్ యంగ్ సెన్సేషన్స్ లో నవీన్ పొలిశెట్టి ఒకరు. చిన్న చిన్న వేషాలతో కెరీర్ ని ఆరంభించి.. క్రమేణా ప్రామిసింగ్ హీరోగా అతను ఎదుగుతున్న తీరు అభినందనీయం. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'జాతిరత్నాలు', 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'.. ఇలా హ్యాట్రిక్ విజయాలతో ప్రస్తుతం తెలుగునాట వార్తల్లో నిలుస్తున్నాడు ఈ యువ కథానాయకుడు.
ఇదిలా ఉంటే, ఫ్లాప్ డైరెక్టర్స్ కు పొలిశెట్టి భలేగా అచ్చొస్తున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే.. 'జాతిరత్నాలు'కి ముందు ఆ చిత్ర దర్శకుడు అనుదీప్.. 'పిట్టగోడ' అనే మూవీ తీశాడు. 'జాతిరత్నాలు' కంటే ఐదేళ్ళ ముందు వచ్చిన 'పిట్టగోడ' ఆశించిన విజయం సాధించలేదు. అయితే నవీన్ తో అనుదీప్ జట్టుకట్టిన 'జాతిరత్నాలు' మాత్రం అఖండ విజయం సాధించింది. ఆ రకంగా సెకండ్ ఫిల్మ్ తో ఫస్ట్ సక్సెస్ చూశాడు అనుదీప్. ఇక 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' దర్శకుడు పి. మహేశ్ బాబు విషయానికి వస్తే.. 2014లో రిలీజైన 'రా రా కృష్ణయ్య'తో డైరెక్టర్ అయ్యాడు. సందీప్ కిషన్, రెజీనా జంటగా నటించిన సదరు సినిమా ఫ్లాప్ అయ్యింది. అయితే, తొమ్మిదేళ్ళ విరామం అనంతరం తన నుంచి వచ్చిన సెకండ్ వెంచర్ 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' విజయపథంలో పయనిస్తోంది. ఇందులో నవీన్ పొలిశెట్టి హీరో. అంటే.. అటు అనుదీప్ కి, ఇటు మహేశ్ బాబుకి డెబ్యూ మూవీస్ తేడా కొట్టినా.. పొలిశెట్టి కాంబినేషన్ కలిసొచ్చిందన్నమాట. ఏదేమైనా.. ఫ్లాప్ డైరెక్టర్స్ కి పొలిశెట్టి బాగానే కలిసొస్తున్నట్టే. మరి.. భవిష్యత్ లోనూ ఇదే తీరున నవీన్ ముందుకు సాగుతాడేమో చూడాలి.