English | Telugu
ఒకే తేదీకి రెండు సీక్వెల్స్.. బిగ్గెస్ట్ బాక్సాఫీస్ వార్!
Updated : Sep 11, 2023
2024 ఆగస్టు 15 కి రెండు బిగ్గెస్ట్ సీక్వెల్స్ బాక్సాఫీస్ బరిలో దిగనున్నాయి. అందులో ఒకటి 'పుష్ప: ది రూల్'(పుష్ప-2) కాగా, మరొకటి 'ఇండియన్-2'. ఇప్పటికే 'పుష్ప-2' రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయగా.. 'ఇండియన్-2' విడుదల తేదీపై మాత్రం అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన పుష్ప మొదటి భాగం 'పుష్ప: ది రైజ్' 2021 డిసెంబర్ లో విడుదలై పాన్ ఇండియా రేంజ్ లో సంచలన విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న 'పుష్ప-2'పై భారీ అంచనాలు ఉన్నాయి. 'పుష్ప-1'కి గాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ జాతీయ అవార్డు గెలుచుకోవడంతో.. ప్రేక్షకుల్లో 'పుష్ప-2'పై మరింత ఆసక్తి పెరిగింది. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవికి విడుదలయ్యే అవకాశముందని ఇటీవల వార్తలు వినిపించాయి. అయితే ఈ చిత్రాన్ని 2024 ఆగస్టు 15 కి విడుదల చేయనున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. అయితే అదేరోజు మరో భారీ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
కమల్ హసన్ ప్రధాన పాత్రలో శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా 'ఇండియన్'(భారతీయుడు). 1996 మేలో విడుదలైన ఈ సినిమా తమిళనాట ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఈ సినిమాకి విశేష ఆదరణ లభించింది. అలాంటి సంచలన సినిమాకి ఏకంగా 28 ఏళ్ళ తర్వాత సీక్వెల్ వస్తోంది. అదే 'ఇండియన్-2'. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాని 2024 ఆగస్టు 15 కి విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు అదే తేదీపై 'పుష్ప-2' కర్చీఫ్ వేసింది. మరి 'ఇండియన్-2' కూడా అదే తేదీకి రావాలని ఫిక్స్ అయితే మాత్రం బిగ్గెస్ట్ బాక్సాఫీస్ వార్ ని చూడబోతున్నాం.