English | Telugu
బాబాయ్ వర్సెస్ అబ్బాయ్.. ఎవరిది పైచేయి?
Updated : Nov 8, 2023
బాబాయ్ నటసింహం నందమూరి బాలకృష్ణ, అబ్బాయ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడొస్తుందా అని నందమూరి అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. బాబాయ్-అబ్బాయ్ కాంబోలో సినిమా అయితే ఇప్పట్లో వచ్చేలా లేదు కానీ, ఈ ఇద్దరు బాక్సాఫీస్ వార్ కి దిగునున్నారనే వార్త మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ 'దేవర'. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ ఫిల్మ్ రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం 2024, ఏప్రిల్ 5న విడుదల కానుంది. అయితే అదే సమయానికి 'NBK 109' కూడా విడుదలయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.
హ్యాట్రిక్ హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్న బాలయ్య తన 109వ సినిమాని బాబీ కొల్లి డైరెక్షన్ లో చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఫిల్మ్ షూటింగ్ తాజాగా ప్రారంభమైంది. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసి ఈ సినిమాని 2024, మార్చి 29న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. అదే జరిగితే వారంరోజుల వ్యవధిలో బాబాయ్, అబ్బాయ్ ల సినిమాలు విడుదల కానున్నాయి. మరి ఈ బాక్సాఫీస్ వార్ లో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.