English | Telugu
మెగా మూవీ వాయిదా!
Updated : Aug 2, 2023
మెగా హీరోల సినిమాలు వరుసగా బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తున్నాయి. రీసెంట్ గా జూలై 28న పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన 'బ్రో' విడుదలైంది. ఆగస్టు 11న చిరంజీవి 'భోళా శంకర్', ఆగస్టు 18న వైష్ణవ్ తేజ్ 'ఆదికేశవ', ఆగస్టు 25న వరుణ్ తేజ్ 'గాండీవధారి అర్జున' విడుదల కానున్నాయి. ఇలా వరుసగా మెగా సినిమాలు విడుదలవుతుండటంతో బాక్సాఫీస్ దగ్గర మెగా జాతర అంటూ అభిమానులు సంబరపడుతున్నారు. అయితే ఇప్పుడు ఈ మెగా జాతర నుంచి ఒక మూవీ తప్పుకున్నట్లు తెలుస్తోంది.
వైష్ణవ్ తేజ్ హీరోగా నూతన దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం 'ఆదికేశవ'. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జోజు జార్జ్, అపర్ణ దాస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 18న విడుదల చేస్తున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. అయితే విడుదల తేదీ దగ్గర పడుతున్నా.. టీజర్, సాంగ్స్, ట్రైలర్ అంటూ మూవీ టీం నుంచి ఎటువంటి హడావుడి లేదు. దానికి కారణం ఈ సినిమా ఇంకా పూర్తి కాకపోవటమేనట. ఈ సినిమాని సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. త్వరలోనే కొత్త విడుదల తేదీపై ప్రకటన వచ్చే అవకాశముంది.
'ఉప్పెన' వంటి బ్లాక్ బస్టర్ ఫిల్మ్ తో హీరోగా పరిచయమైన వైష్ణవ్ తేజ్.. ఆ తర్వాత 'కొండపొలం', 'రంగ రంగ వైభవంగా' సినిమాలతో నిరాశ పరిచాడు. ఈ క్రమంలో అతను తన నాలుగో సినిమా 'ఆదికేశవ'తో యాక్షన్ బాట పట్టాడు. మరి ఈ చిత్రం అతనికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.