English | Telugu
మెగా బ్రదర్స్ ఇప్పటికైనా మారతారా?
Updated : Aug 1, 2023
'రీమేక్ లు వద్దు స్ట్రయిట్ సినిమాలే ముద్దు' అని అభిమానులు ఎంత మొత్తుకుంటున్నా మెగా హీరోల ఆలోచనలో మార్పు రావడం లేదు. పరాజయాలు ఎదురైనా రీమేక్ సినిమాల వైపే మొగ్గుచూపుతున్నారు. అప్పట్లో రీమేక్ సినిమానా? స్ట్రయిట్ సినిమానా? అనే ఆలోచన పెద్దగా ఉండేదికాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఈ ఓటీటీ యుగంలో ఇంట్లో ఉండే అన్ని భాషల సినిమాలు చూస్తుండటంతో.. రీమేక్ లపై ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించడంలేదు. దాంతో రీమేక్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర చేతులెత్తేస్తున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తాయి. అయితే ఈ ఓటీటీ ట్రెండ్ లో వారు రీమేక్ లు చేస్తూ అనవసరంగా పరాజయాలు మూటగట్టుకుంటున్నారనే భావన కలుగుతోంది. రాజకీయాల కోసం సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన చిరంజీవి, రీఎంట్రీ తర్వాత.. ఓ రీమేక్, ఓ స్ట్రయిట్ సినిమా అన్నట్లుగా చేస్తున్నారు. ఆయన గత రెండు చిత్రాలను పరిశీలిస్తే 'గాడ్ ఫాదర్' రీమేక్ కాగా, 'వాల్తేరు వీరయ్య' స్ట్రయిట్ ఫిల్మ్. 'గాడ్ ఫాదర్' హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ రూ.60 కోట్ల షేర్ మాత్రమే రాబట్టి బాక్సాఫీస్ ఫెయిల్యూర్ గా మిగలగా, 'వాల్తేరు వీరయ్య' మాత్రం డివైడ్ టాక్ తో రూ.135 కోట్లకు పైగా షేర్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంటే హిట్ టాక్ తెచ్చుకున్న రీమేక్ ఫ్లాప్ ఇస్తే, యావరేజ్ టాక్ తెచ్చుకున్న స్ట్రయిట్ ఫిల్మ్ మాత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అన్నయ్య బాటలోనే తమ్ముడు అన్నట్లుగా, పవన్ కళ్యాణ్ సైతం రీమేక్ లు కారణంగా పాజిటివ్ టాక్ తెచ్చుకొని కూడా పరాజయాలను అందుకున్నారు.
చిరంజీవి మాదిరిగానే రాజకీయాల కోసం సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చిన పవన్, రీఎంట్రీ తర్వాత వరుసగా రీమేక్ సినిమాలే చేస్తున్నారు. రీఎంట్రీ తర్వాత ఆయన నటించిన మూడు సినిమాలు రీమేక్ లే. 'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్' సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, ఫుల్ రన్ లో బయ్యర్లకు నష్టాలనే మిగిల్చాయి. ఇక ఇటీవల విడుదలైన మరో రీమేక్ 'బ్రో' సినిమా పరవాలేదు అని టాక్ తెచ్చుకొని, నాలుగో రోజుకే కలెక్షన్స్ బాగా డ్రాప్ అయ్యి ఫ్లాప్ దిశగా పయనిస్తోంది. ఇలా రీమేక్ లతో వరుస షాక్ లు తగులుతున్నా మెగా బ్రదర్స్ తీరు మాత్రం మారడంలేదు. ఆగస్టు 11న విడుదల కానున్న చిరంజీవి తాజా చిత్రం 'భోళా శంకర్' సైతం రీమేక్ సినిమానే. ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందోనన్న భయం మెగా అభిమానుల్లో ఉంది. మరి ఇకముందైనా రీమేక్ సినిమాల విషయంలో మెగా బ్రదర్స్ ఆలోచనలో పడతారేమో చూడాలి. ఎందుకంటే కేవలం మెగా అభిమానులు మాత్రమే కాదు.. సాధారణ ప్రేక్షకులు, సినీ ప్రియులు సైతం వారు స్ట్రయిట్ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించాలని కోరుకుంటున్నారు.