English | Telugu
‘తగ్గేదేలే..’ అంటున్న మన్సూర్.. మంచి ఫోటోలు దొరకలేదా అంటూ మీడియాపై ఫైర్
Updated : Nov 21, 2023
మన్సూర్ అలీఖాన్ వివాదం రోజురోజుకీ ముదురుతున్నట్టుగా కనిపిస్తోంది. అతను త్రిష, రోజా, ఖుష్బూలపై చేసిన వ్యాఖ్యలకు సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. త్రిషను సపోర్ట్ చేస్తూ ఎంతో మంది సినీ ప్రముఖులు స్పందించారు. ఈ వీడియోను చూసిన తమిళ నడిగర్ సంఘం మన్సూర్‌పై నిషేధం విధించింది. దీనిపై మండిపడ్డ మన్సూర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో తనదైన శైలిలోనే స్పందించాడు. నడిగర్ సంఘానికి నాలుగు గంటలు టైమిస్తున్నానని, ఈలోగా తనపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశాడు. జరిగిన దాని గురించి వివరణ అడగకుండా, తనను సంప్రదించకుండా తనను ఎలా నిషేధిస్తారని ప్రశ్నిస్తున్నాడు.
ఎంతమంది నుంచి ఎన్ని విమర్శలు వస్తున్నా.. తను మాత్రం తగ్గేదేలే అంటున్నాడు మన్సూర్. క్షమాపణ కూడా చెప్పను అని ఖరాఖండీగా చెబుతున్నాడు. తాను సరదాగా అన్న మాటలను మీడియా వక్రీకరించిందని, వీడియోను ఎడిట్ చేసి తనను అభాసుపాలు చెయ్యాలని ప్రయత్నిస్తోందని విమర్శించాడు. సినిమాల్లో రేప్ చేస్తే నిజంగా చేసినట్టు అవుతుందా.. అలాగే సినిమాల్లో హత్య చేసినట్టుగా చూపిస్తే అది నిజంగా చేసినట్టా అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నాడు. తాను తప్పు చేస్తే క్షమాపణ అడిగేందుకు సిద్ధమేనని, అయితే తానేమీ తప్పు చేయలేదని అంటున్నాడు. నడిగర్ సంఘం మాత్రం మన్సూర్ క్షమాపణ చెప్పి తీరాలని, లేకపోతే నిషేధం కొనసాగుతుందని తేల్చి చెప్పింది. ఎంతో సీరియస్‌గా జరుగుతున్న ప్రెస్‌మీట్‌లో మరో అంశాన్ని లేవనెత్తాడు మన్సూర్. తను అన్న మాటల గురించి అన్ని మీడియా సంస్థలు రాశాయని, అయితే అందులో వాడిన ఫోటోలు అంత క్వాలిటీగా లేవని, అంతకంటే మంచి ఫోటోలు మీకు దొరకలేదా అంటూ మీడియాను ఒకింత సీరియస్‌గానే అడిగాడు మన్సూర్. ఈ ప్రశ్నతో అక్కడి మీడియా ప్రతినిధులు షాక్ అయ్యారు.