English | Telugu
తెలంగాణ ఎన్నికలకు ముందు సంపూ సంచలనం!
Updated : Nov 21, 2023
సంపూర్ణేష్ బాబు టైటిల్ రోల్ పోషించిన రీసెంట్ మూవీ 'మార్టిన్ లూథర్ కింగ్'. ఇది తమిళ సినిమా 'మండేలా'కు రీమేక్ గా రూపొందింది. వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో మహాయాన మోషన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. 'కేరాఫ్ కంచరపాలెం', ఫేమ్ దర్శకుడు వెంకటేష్ మహా ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించడం విశేషం. ఓటు విలువని తెలియజేస్తూ తీసిన ఈ పొలిటికల్ సెటైరికల్ ఫిల్మ్ అక్టోబర్ 27న విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. సంపూ యాక్టింగ్, సినిమా కాన్సెప్ట్ బాగున్నప్పటికీ, నెమ్మదిగా సాగే కథనం కారణంగా అంతగా మెప్పించలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతోంది.
స్టార్ హీరోల సినిమాలకు స్పూఫ్స్ లా ఉండే సినిమాల్లో నటించిన సంపూ.. మొదటిసారి రూట్ మార్చి చేసిన కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా 'మార్టిన్ లూథర్ కింగ్'. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ దక్కించుకుంది. ఈ చిత్రాన్ని నవంబర్ 29 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోనీ ప్రకటించింది. తెలుగుతో పాటు హిందీ, మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది.
'మార్టిన్ లూథర్ కింగ్' మూవీ రివ్యూ..
కాగా, నవంబర్ 30న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ కి సరిగ్గా ఒక్క రోజు ముందు.. ఓటు విలువని తెలియజేస్తూ సంపూ చేసిన రాజకీయ వ్యంగ్య చిత్రం ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. మరి ఎన్నికల వేళ ఓటీటీలో ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.