English | Telugu
పాన్ ఇండియా మూవీలో కిరణ్ అబ్బవరం!
Updated : Sep 17, 2023
ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. కానీ ఈ మధ్య కొందరు కుర్ర హీరోలు మాత్రం అప్పుడే పాన్ ఇండియా కలలు కంటున్నారు. ఇప్పుడు ఆ లిస్టులో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా చేరినట్లు తెలుస్తోంది.
ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ రంగంలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన కిరణ్.. 'రాజావారు రాణిగారు', 'ఎస్ఆర్ కల్యాణమండపం' వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వరుస అవకాశాలు క్యూ కట్టాయి. అయితే కిరణ్ ని పరాజయాలే ఎక్కువగా పలకరిస్తున్నాయి. అతన్ని టైర్-2 హీరోల లిస్టులో చేర్చే సరైన విజయాలు దక్కడంలేదు. ప్రస్తుతం తన ఆశలన్నీ అక్టోబర్ 6న విడుదల కానున్న 'రూల్స్ రంజన్'పైనే ఉన్నాయి. ఈ క్రమంలో కిరణ్ చూపు పాన్ ఇండియా వైపు మళ్ళిందనే వార్త ఆసక్తికరంగా మారింది.
కిరణ్ అబ్బవరం ఓ పాన్ ఇండియా పీరియాడిక్ సినిమాలో నటిస్తున్నట్లు న్యూస్ వినిపిస్తోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో కిరణ్ పోస్ట్ మాన్ గా కనిపించనున్నాడని సమాచారం. కాగా పాన్ ఇండియా మూవీలో కిరణ్ నటిస్తున్నాడనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. అప్పుడే పాన్ ఇండియా సినిమాలు అవసరమా అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు మాత్రం కంటెంట్ బాగుంటే 'కార్తికేయ-2' తరహాలో మ్యాజిక్ జరగొచ్చని పాజిటివ్ గా స్పందిస్తున్నారు.