English | Telugu
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' సాంగ్ పై ట్రోల్స్!
Updated : Sep 17, 2023
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'గేమ్ ఛేంజర్'. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఊహించని విధంగా ఓ సాంగ్ లీకైన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న దిల్ రాజు.. ఇప్పటికే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే ఊరందరిదీ ఒక బాధయితే, వీడిది ఇంకో బాధ అన్నట్టుగా.. ఓ వైపు సాంగ్ లీక్ అయిందని మూవీ టీం బాధపడుతుంటే, మరోవైపు ఆ సాంగ్ బాలేదంటూ కొందరు ట్రోల్స్ చేస్తున్నారు.
శంకర్ సినిమాలలో సాంగ్స్ కి స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఆడియో పరంగా కానీ, పిక్చరైజేషన్ పరంగా కానీ పాటలు అద్భుతంగా ఉంటాయి. అయితే 'గేమ్ ఛేంజర్' నుంచి లీకైన పాటను విన్న కొందరు.. అసలు ఈ పాట శంకర్ స్థాయిలో లేదంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే, రామ్ చరణ్-శంకర్ కలయికలో వస్తున్న మొదటి సినిమాకి ఇలాంటి సాంగ్ కంపోజ్ చేస్తావా అని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ని ట్రోల్ చేస్తున్నారు. అయితే నిజానికి లీక్ అయిన సాంగ్ రఫ్ వెర్షన్ మాత్రమేనని, పాడింది కూడా ట్రాక్ సింగర్ అని, తుది మెరుగులు దిద్దిన తర్వాత పాట స్వరూపమే మారిపోతుందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయినప్పటికీ లిరిక్స్ కూడా చరణ్-శంకర్ కాంబోలో వస్తున్న సినిమా స్థాయికి తగ్గట్టుగా లేవనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ సాంగ్ సినిమాలో ఉంటుందో లేక లీక్, ట్రోల్స్ ని దృష్టిలో పెట్టుకొని మూవీ టీమ్ కొత్త సాంగ్ ని కంపోజ్ చేయిస్తుందో చూడాలి.