English | Telugu
మరో క్రేజీ మల్టీస్టారర్ లో జూనియర్ ఎన్టీఆర్!
Updated : Apr 26, 2023
అప్పట్లో స్టార్ హీరోలు ఎలాంటి భేషజాలకు పోకుండా ఇతర స్టార్స్ తో కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేసేవారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి దిగ్గజ నటులు ఎన్నో మల్టీస్టారర్స్ లో నటించారు. అయితే ఈ తరం స్టార్స్ మాత్రం మల్టీస్టారర్స్ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. ఏదో ఒకటి అరా వస్తున్నాయంతే. స్టార్ డమ్ ని, ఫ్యాన్ వార్స్ ని దృష్టిలో పెట్టుకొని చాలామంది స్టార్స్ మల్టీస్టారర్స్ విషయంలో వెనకడుగు వేస్తున్నారు. అయితే ఈ తరంలో గొప్ప నటుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మాత్రం.. ఇలాంటి లెక్కలు వేసుకోకుండా మల్టీస్టారర్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు.
ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఆర్ఆర్ఆర్'లో రామ్ చరణ్ తో కలిసి ఎన్టీఆర్ తెరను పంచుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో భారీ పాన్ ఇండియా సినిమా ప్రకటించాడు. ఓ వైపు సోలో హీరోగా భారీ ప్రాజెక్ట్ లు చేస్తూనే, మరోవైపు బడా మల్టీస్టారర్స్ లోనూ భాగమవుతున్నాడు. యశ్ రాజ్ ఫిలిమ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న స్పై యూనివర్స్ లో హృతిక్ రోషన్ తో కలిసి 'వార్-2'లో ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు. ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ యూనివర్స్ గా పేరు తెచ్చుకున్న దానిలో ఎన్టీఆర్ భాగమవుతుండటం ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపింది. ఇదిలా ఉంటే మరో క్రేజీ మల్టీస్టారర్ లోనూ ఎన్టీఆర్ భాగం కానున్నాడని తెలుస్తోంది. సౌత్ స్టార్ ని, నార్త్ స్టార్ ని కలుపుతూ తీయనున్న మరో భారీ పాన్ ఇండియా మల్టీస్టారర్ కోసం అవకాశం ఎన్టీఆర్ ని వెతుక్కుంటూ వచ్చినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ లో ఓ బాలీవుడ్ బడా స్టార్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ పంచుకోనున్నాడట. అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ చిత్రాన్ని టీ-సిరీస్ నిర్మించనుందని వినికిడి. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది అంటున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ లైనప్ చూస్తుంటే నటుడిగా సంతృత్తినిచ్ఛే పాత్రలు చేస్తూనే, పాన్ ఇండియా ఇమేజ్ ని మరింత పెంచుకునే సినిమాలు చేస్తూ పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్తున్నాడు అనిపిస్తోంది.