English | Telugu
పవన్ కల్యాణ్ డైరెక్టర్‌గా పరిచయమైన 'జానీ'కి 20 యేళ్లు
Updated : Apr 25, 2023
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన 'ఖుషి' సినిమా అప్పటికి ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్ గ్రాసర్. దాని తర్వాత పవన్ ఇమేజ్ శిఖరాగ్రానికి చేరింది. యూత్‌లో ఆయన క్రేజ్ ఎలా అయ్యిందంటే.. ఆయన మేనరిజమ్స్, ఆయన స్టైలింగ్‌ను అనుకరిస్తూ వచ్చారు. కెరీర్ ఉన్నత స్థాయిలో ఉన్న ఆ టైంలో 'జానీ' అనే సినిమాని సొంత డైరెక్షన్‌లో తియ్యాలని సంకల్పించి, అందర్నీ ఆశ్చర్యానికి లోను చేశారు పవన్. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించిన 'జానీ' సినిమా మన ముందుకు వచ్చి, నేటికి సరిగ్గా 20 ఏళ్లు. 2003 ఏప్రిల్ 25న ఆ సినిమా విడుదలైంది. అంటే.. పవన్ కల్యాణ్‌లోని దర్శకుడి వయసు 20 యేళ్లన్న మాట!
'ఖుషి' తర్వాత సినిమా కావడంతో రిలీజ్ టైంకు 'జానీ'పై అంచనాలు అంబరాన్ని తాకాయి. అయితే వాటిని అందుకోవడంలో ఆ సినిమా ఫెయిలయ్యింది. బ్లడ్ కేన్సర్ బారినపడ్డ భార్యను బతికించుకోవడానికి కావాల్సిన డబ్బుకోసం ఇంటర్నేషనల్ కిక్‌బాక్సర్స్‌తో పోటీపడే మార్షల్ ఆర్ట్స్ కోచ్ జానీ కథ ఈ సినిమా. అదివరకు 'బద్రి' సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించిన రేణూ దేశాయ్ ఈ సినిమాలో జానీని ప్రేమించి పెళ్లాడే గీతాంజలి పాత్రను చేశారు. ఈ సినిమా నిర్మాణ సమయంలోనే ఆ ఇద్దరి మధ్య ప్రేమ బలపడి, అది సహజీవనానికి దారితీసింది.
జాని తండ్రిగా రఘువరన్ నటించిన ఈ మూవీలో, తల్లిగా గీత, సవతి తల్లిగా లిల్లెట్ దూబే, విలన్ తాత్యాగా రజా మురాద్ నటించారు. అలీ, బ్రహ్మాజీ, మల్లికార్జునరావు, ఎమ్మెస్ నారాయణ, సూర్య, సత్యప్రకాశ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేశారు. చోటా కె. నాయుడు, శ్యాం పాలవ్ సినిమాటోగ్రాఫర్లుగా వర్క్ చేసిన ఈ మూవీకి రమణ గోగుల సంగీతం ప్లస్‌గా నిలిచింది. 'నువ్వు సారా తాగుటమానురన్నో', 'రావోయి మా కంట్రీకి' పాటల్ని పవన్ స్వయంగా ఆలపించారు. 'చిట్టి చెల్లెలు' (1970) మూవీలోని పాపులర్ సాంగ్ 'ఈ రేయి తీయనిది'ని ఇందులో పవన్ రీమిక్స్ చేశారు. పవన్, రేణులపై దాన్ని చిత్రీకరించిన తీరు బాగా ఆకట్టుకుంది. 'నారాజ్ గాకుర మా అన్నయా', 'ఏచోట నువ్వున్నా' పాటలు కూడా బాగా పాపులర్ అయ్యాయి.
250 ప్రింట్లతో విడుదలైన తొలి తెలుగు సినిమాగా రికార్డుల్లోకి ఎక్కిన 'జానీ'.. విడుదలైన కాలంలో బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచినా, తర్వాత కాలంలో ఒక మంచి సినిమాగా, దర్శకునిగా పవన్ కల్యాణ్‌లోని అభిరుచిని తెలియజేసిన సినిమాగా, టెక్నికల్‌గా ఎంతో ఉన్నత స్థాయిలో ఉందనే పేరు పొందింది. ఈ సినిమా బాక్సాఫీస్ ఫలితం తర్వాత మళ్లీ ఇంతదాకా దర్శకత్వం జోలికి పోలేదు పవన్ కల్యాణ్.