English | Telugu
కళ్ళు చెదిరేలా 'ఏజెంట్' ప్రీ రిలీజ్ బిజినెస్!
Updated : Apr 26, 2023
అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ 'ఏజెంట్'. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమాలో సాక్షి వైద్యా హీరోయిన్ కాగా.. మమ్ముట్టి, డినో మోరియా ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీ ఈ శుక్రవారం(ఏప్రిల్ 28) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం పలుసార్లు వాయిదా పడి, ఆలస్యంగా విడుదలవుతున్నా.. రికార్డు స్థాయిలో థియేట్రికల్ బిజినెస్ జరగడం ఆశ్చర్యపరుస్తోంది.
ఏజెంట్ మూవీ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ రూ.36 కోట్లని తెలుస్తోంది. ఓ యంగ్ హీరో సినిమాకి ఈ స్థాయి బిజినెస్ జరగడం విశేషమే. అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన అఖిల్ పై ముందు నుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఆయన మొదటి సినిమా 'అఖిల్' ఏకంగా 40 కోట్లకు పైగా బిజినెస్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ సినిమా ప్లాప్ అయినప్పటికీ రెండో సినిమా 'హలో' కూడా 30 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. రెండో సినిమా కూడా ఆశించిన స్థాయిలో అలరించకపోవడంతో.. తరువాతి రెండు సినిమాలు 20 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేశాయి. అయితే ఇప్పుడు తన ఐదో సినిమా 'ఏజెంట్' బిజినెస్ తో మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచాడు అఖిల్. ఈ సినిమా పలుసార్లు వాయిదా పడినా, మొదట్లో ఉన్నంత బజ్ ఇప్పుడు లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా.. 36 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేసింది. నైజాంలో 10 కోట్లు, సీడెడ్ లో 4.50 కోట్లు, ఆంధ్రాలో 14.80 కోట్లతో తెలుగు రాష్ట్రాల్లో 29.30 కోట్ల బిజినెస్ చేసిన ఏజెంట్.. రెస్టాఫ్ ఇండియా 3.80 కోట్లు, ఓవర్సీస్ లో 3.10 కోట్లు కలిపి వరల్డ్ వైడ్ గా రూ.36.20 కోట్లు బిజినెస్ చేసింది. 37 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న ఏజెంట్.. అఖిల్ కి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.