English | Telugu
కాలు దువ్వుతున్న హీరోయిన్లు: హీరోలే కాదు.. మేమూ పోటీకి సిద్ధమే!
Updated : Oct 26, 2023
ఒక సినిమా సూపర్‌హిట్ అయ్యిందంటే దానికి టీమ్ వర్కే కారణం అంటుంటారు. అదే ఫ్లాప్ అయితే ఎవరో ఒకరి మీద దాన్ని నెట్టేస్తారు. ఈ విషయాన్ని పక్కన పెడితే ఒక సినిమాకి కథ, కథనం, హీరో, డైరెక్టర్ ఎంత ముఖ్యమో.. హీరోయిన్ కూడా అంతే ముఖ్యం. సీరియస్‌గా వెళ్ళే కథని కాస్త దారి మళ్ళించి గ్లామర్ వైపు తీసుకెళ్ళేందుకు హీరోయిన్ ఎంతో అవసరం అవుతుంది. ప్రేక్షకుల్ని తమ అందాలతో కనువిందు చేసేందుకు ప్రతి సినిమాలో హీరోయిన్ సిద్ధంగా ఉండాల్సిందే. ఒక్కోసారి హీరోయిన్ గ్లామర్ కూడా సినిమాకి పెద్ద ప్లస్ అవుతుంది. ఇది చాలా సినిమాలకు ప్రూవ్ అయ్యింది.
ఎప్పుడూ హీరోల మధ్యే పోటీనా, మా మధ్య కూడా పోటీ ఉండాల్సిందే అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు ఇద్దరు హీరోయిన్లు. వారే శ్రుతి హాసన్, తాప్సీ. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘సలార్’లో శ్రుతి హాసన్ హీరోయిన్ కాగా, షారూఖ్ ఖాన్ హీరోగా రూపొందుతున్న ‘డంకీ’లో తాప్సీ హీరోయిన్. ఈ రెండు సినిమాలు ఒకేరోజు అంటే డిసెంబర్ 22న విడుదల కాబోతున్నాయి. ‘జవాన్’తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన షారూఖ్ మంచి జోరు మీద ఉన్నాడు. అదే ఊపులో ‘డంకీ’ కూడా సూపర్‌హిట్ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. మరో పక్క ‘కెజిఎఫ్’ వంటి సాలిడ్ హిట్ సిరీస్ తీసిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సలార్’పై భారీ అంచనాలే ఉన్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో ప్రశాంత్ చేస్తున్న ఈ సినిమా బిజినెస్ పరంగా ఇప్పటికే రికార్డులు సృష్టిస్తోంది. ఇక థియేటర్స్‌లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందోనని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే... హీరోల మధ్యే పోటీ ఉంటుందా.. మేమూ పోటీకి సిద్ధమే అంటూ శ్రుతిహాసన్, తాప్సీ రెడీ అయిపోయారు. అయితే ఈ విషయంలో ఇద్దరిలో ఎవరూ కామెంట్ చేయనప్పటికీ.. సోషల్ మీడియాలో ఈ రెండు సినిమాల వల్ల వీరిద్దరి మధ్య పోటీ నెలకొందని, ఇందులో ఎవరు నెగ్గుతారో చూడాలి అంటూ చర్చలు మొదలయ్యాయి. కొందరు నెటిజన్లు శ్రుతిహాసన్‌ను సపోర్ట్ చేస్తుండగా, మరికొందరు తాప్సీని బలపరుస్తున్నారు. ఇద్దరూ టాప్ హీరోయిన్సే. ఇద్దరూ ఎన్నో సూపర్‌హిట్ సినిమాల్లో నటించారు. ఇప్పుడు సోషల్ మీడియాలో హీరోల మధ్య పోటీ గురించి చర్చిస్తూనే.. హీరోయిన్ల గురించి కూడా ప్రస్తావిస్తున్నారు. మరి ఈ సినిమాల రిజల్ట్ ఎవరికి అనుకూలంగా ఉంటుందో చూడాలి.