English | Telugu
బాలయ్య ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్!
Updated : Oct 26, 2023
ప్రస్తుతం టాలీవుడ్ లో నటసింహం నందమూరి బాలకృష్ణ పేరు మారుమోగిపోతోంది. ఆయన తన తాజా చిత్రం 'భగవంత్ కేసరి'తో సీనియర్ స్టార్స్ కి ఓ కొత్త దారిని చూపించాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో షైన్ స్క్రీన్స్ నిర్మించిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్ కాదు. మంచి సందేశం, బలమైన ఎమోషన్స్ తో రూపొందిన సినిమా. ఇందులో బాలకృష్ణ పాత్ర వయసుకి తగ్గట్టుగా ఎంతో హుందాగా ఉంది. తనకు సాయం చేసిన ఓ వ్యక్తి చనిపోతే.. అతని కూతురు బాధ్యతను తీసుకొని, తండ్రిలా చూసుకుంటూ ఆమెని సింహంలా ధైర్యంగా మార్చే పాత్రలో బాలయ్య చక్కగా ఒదిగిపోయారు. ఓ రకంగా ఆ పాత్రకు ప్రాణం పోశారని చెప్పొచ్చు. బాలయ్య పాత్ర, ఎమోషన్స్ అంత బలంగా ఉన్నాయి కాబట్టే.. 'భగవంత్ కేసరి'కి అన్ని వర్గాల ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే బాలయ్య తదుపరి చిత్రం కూడా 'భగవంత్ కేసరి'కి ఏమాత్రం తగ్గకుండా ఉంటుందట.
బాలయ్య తన 109వ సినిమాని బాబీ కొల్లి డైరెక్షన్ లో చేయనున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. బాలయ్యను అభిమానించే నిర్మాత నాగవంశీ ఈ సినిమా మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ బాబీ కూడా ఈ సినిమా కోసం బలమైన కథను ఎంచుకున్నాడట. బాలయ్య పాత్ర కూడా ఎంతో పవర్ ఫుల్ గా ఉంటుందట. 'భగవంత్ కేసరి'లో బాలయ్యను సరికొత్తగా చూపించి అనిల్ రావిపూడి ఎలా ఆకట్టుకున్నాడో.. బాబీ అంతకుమించి బాలయ్యను మరింత కొత్తగా చూపించబోతున్నాడట. ఇప్పటిదాకా బాలయ్య పోషించిన పాత్రలకు భిన్నంగా ఇది ఉంటుందట. ఈ పాత్ర కోసం బాలయ్య మేకోవర్ కూడా చాలా కొత్తగా ఉంటుందని టాక్.
ఇప్పటికే బాలయ్య.. 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' సినిమాలతో వరుస విజయాలు అందుకొని జోరు మీద ఉన్నారు. 'NBK 109'తో వాటికి మించిన విజయం అందుకోవడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట.