English | Telugu
శ్రీలంకలో జరిగిన దగ్గుబాటి అభిరామ్-ప్రత్యూషల డెస్టినేషన్ వెడ్డింగ్!
Updated : Dec 7, 2023
యంగ్ హీరోలు ఒక్కొక్కరుగా పెళ్లి బాట పడుతున్నారు. ఇటీవల వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి వివాహం ఇటలీలో ఎంతో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి అభిరామ్ ఓ ఇంటివాడయ్యాడు. స్టార్ ప్రొడ్యూసర్ డి.సురేష్‌బాబు రెండో తనయుడు అభిరామ్-ప్రత్యూషల వివాహం డిసెంబర్ 6 సాయంత్రం గం.8.50లకు జరిగింది. శ్రీలంకలో వీరి పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధువుల సమక్షంలో ప్రత్యూష మెడలో మూడు ముళ్లు వేశారు అభిరామ్. శ్రీలంకలో జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్ మూడు రోజుల పాటు జరిగింది. ఇక వీరి మ్యారేజ్ ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. దీంతో దగ్గుబాటి ఫ్యాన్స్, సినీ ప్రముఖులు అభిరామ్-ప్రత్యూష దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
మూవీ మొఘల్ డా. డి.రామానాయుడు తనయులు సురేష్‌బాబు, వెంకటేష్. సురేష్‌బాబు నిర్మాత ఎన్నో మంచి సినిమాలు నిర్మించారు. ఇక వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెపక్కర్లేదు. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. ఇక సురేష్‌బాబు పెద్ద కుమారుడైన రానా హీరోగా, విలన్‌గా పలు విభిన్నమైన క్యారెక్టర్స్ చేస్తూ తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నారు. చిన్న కుమారుడు అభిరామ్ మంచి నటుడిగా పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తేజ దర్శకత్వంలో రూపొందిన ‘అహింస’ సినిమాతో టాలీవుడ్‌కు హీరోగా పరిచయమయ్యారు. అయితే ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందించలేకపోయింది. మొదటి సినిమా నిరాశ పరచడంతో తన నెక్స్‌ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రయత్నాలను ప్రస్తుతానికి విరమించారని తెలుస్తోంది. వివాహం తర్వాత తన నెక్స్‌ట్ సినిమాను ఎనౌన్స్ చేసే అవకాశం ఉందట.