English | Telugu
నిన్న సమ్మర్‌లో జరిగిందే.. రేపు వినాయక చవితికి కూడా జరగబోతోంది
Updated : Sep 6, 2023
సాధారణంగా ఏ సినిమా అయినా సీజన్ చూసుకొని రిలీజ్ చేస్తారు. రిలీజ్ టైమ్, అకేషన్ ఏం వుంది? థియేటర్లకు ప్రేక్షకులు వచ్చే ఛాన్స్ ఉందా? అనేది ఆలోచించి రిలీజ్ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటారు. అయితే ఈమధ్య అలా జరగడం లేదు. మంచి సీజన్ ఉన్నా దాన్ని పట్టించుకోవడం లేదు. నిన్న సమ్మర్‌లో అదే జరిగింది. సమ్మర్ సీజన్‌లో టాలీవుడ్‌లో భారీ సినిమా ఒక్కటీ రిలీజ్ అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ అవుతోంది. రాబోయే వినాయక చవితి పండగకి రామ్, బోయపాటి కాంబినేషన్‌లో రూపొందిన ‘స్కంద’ రిలీజ్ అవుతుందని మొదట ప్రకటించారు. సెప్టెంబర్ 15న ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ, కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను సెప్టెంబర్ 28కి వాయిదా వేశారు. అంటే పండగ అయిపోయిన 10 రోజులకు ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఇదే సీజన్‌లో సెప్టెంబర్ 28న ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘సలార్’ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రం రిలీజ్‌ని కూడా వాయిదా వేశారు. నవంబర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి మేకర్స్ ఎలాంటి ప్రకటన చేయలేదు.
అంటే ఈ వినాయక చవితికి ముందుగానీ, తర్వాతగానీ భారీ తెలుగు సినిమా ఏదీ రిలీజ్ అవ్వడం లేదన్నమాట. అది డబ్బింగ్ సినిమాలకు అడ్వాంటేజ్‌గా మారింది. లారెన్స్, కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘చంద్రముఖి2’ సెప్టెంబర్ 15న పండగ సినిమాగా విడుదలవుతోంది. దీనితోపాటు విశాల్ హీరోగా రూపొందిన డిఫరెంట్ జోనర్ మూవీ ‘మార్క్ ఆంటోని’ రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో దర్శకుడు ఎస్.జె.సూర్య కీలక పాత్ర పోషించాడు. ఏది ఏమైనా టాలీవుడ్ సినిమాలకు సంబంధించి ఈ సంవత్సరం రెండు సీజన్లు ఖాళీ అయిపోయి డబ్బింగ్ సినిమాలకు ప్లస్ అయింది.