English | Telugu
రితేష్ వల్లనే నటించాల్సి వచ్చిందంటున్న జెనీలియా
Updated : Feb 21, 2023
తన భర్త రితేష్ దేశ్‌ముఖ్ వల్లనే మళ్లీ నటించాల్సి వచ్చిందని అంటున్నారు జెనీలియా దేశ్‌ముఖ్. తెలుగులో నాగచైతన్య, సమంత నటించిన మజిలీని మరాఠీలో వేడ్ అనే పేరుతో తెరకెక్కించారు. ఈ సినిమాలో రితేష్, జెనీలియా జంటగా నటించారు. రితేష్ దర్శకత్వం కూడా వహించారు. ఈ సినిమాకు చాలా మంచి స్పందన వచ్చింది. జెనీలియా మాట్లాడుతూ ``వేడ్‌కి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌కి ఫిదా అయ్యాను. పదేళ్ల బ్రేక్ తర్వాత నేను చేసిన సినిమా ఇది. ఇలాంటి సమయంలో ఈ ఫీడ్‌బ్యాక్ చూసి పొంగిపోయాను. ఇప్పుడిప్పుడే ఆ భావన నుంచి బయటపడుతున్నాను. కానీ వేడ్ జర్నీ జీవితాంతం గుర్తుండిపోతుంది`` అని అన్నారు.
2012లో `నా ఇష్టం`లో ఆఖరిసాయి ఫుల్ ప్లెడ్జ్డ్ రోల్ చేశారు జెనీలియా. ఆ తర్వాత జైహో, ఫోర్స్ 2లో కేమియో అప్పియరెన్స్‌లు ఇచ్చారు. పెళ్లయ్యాక పిల్లల కోసం, ఫ్యామిలీ కోసం సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టారు. బ్రేక్ గురించి మాట్లాడుతూ ``నా కోసం, నా పిల్లల కోసం నేను బ్రేక్ తీసుకోవాలనుకున్నాను. నా నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నాను. గృహిణిగా, ఇద్దరు పిల్లల తల్లిగా ఉంటూనే, ప్రొడక్షన్ హౌస్ మొదలుపెట్టాను. మ్యూజిక్ లేబుల్ స్టార్ట్ చేశాను. నా సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాను. నటనతో పాటు సినిమా రంగంలో ఇవన్నీ చేయగలనని ప్రూవ్ చేసుకున్నాను`` అని అన్నారు.
రితేష్ గురించి చెబుతూ ``వేడ్‌ని రితేష్ డైరక్ట్ చేయబట్టే ఈ కేరక్టర్‌లో నేను చేశాను. అయినా ఇప్పుడు ఈ పాత్రకు నేను అవసరమా అని కూడా రితేష్‌ని అడిగాను. ఇన్నాళ్లు నీకు నచ్చినట్టు ఉన్నావు. ఇప్పుడు మళ్లీ నటించాల్సిన సమయం వచ్చింది. చేయమని అన్నారు. నాక్కూడా తను చెప్పింది నిజమేననిపించింది. అందుకే యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నాను. ఇకపై కూడా వరుసగా సినిమాలు చేయాలని లేదు. మంచి పాత్రలు వచ్చేదాకా వెయిట్ చేయడానికి నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు. నా టైమ్‌కి అనుకూలంగా ఉండే ప్రాజెక్టులను తప్పకుండా టేకప్ చేస్తాను`` అని అన్నారు జెనీలియా. త్వరలోనే తెలుగులో రామ్ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు జెనీలియా. రామ్, జెనీలియా ఇద్దరూ మంచి ఫ్రెండ్స్.