English | Telugu
మెగాస్టార్ మూవీ సెట్ లో భారీ అగ్నిప్రమాదం
Updated : Feb 28, 2023
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రధారులుగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఆచార్య'. గతేడాది విడుదలైన ఈ చిత్రం ఘోర పరాజయం పాలైంది. ఈ సినిమా కోసం భారీగా ఖర్చు పెట్టారు. హైదరాబాద్ లోని కోకాపేట లేక్ వద్ద భారీ సెట్ కూడా వేశారు. అయితే ఈ సెట్ లో తాజాగా అగ్నిప్రమాదం జరిగింది.
ఆచార్య సినిమా కోసం కోకాపేటలో వేసిన సెట్ కోసం అప్పుడు దాదాపు రూ.20 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. సినిమా పూర్తయ్యాక కూడా ఆ సెట్ ని అలాగే ఉంచారు. అయితే సోమవారం రాత్రి ఈ సెట్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడడంతో స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.