English | Telugu
చేతులెత్తేసిన 'ఎక్స్ ట్రా'.. నితిన్ పని అయిపోయినట్టేనా?
Updated : Dec 10, 2023
ఈ జనరేషన్ లో వరుసగా అత్యధిక పరాజయాలు ఎదుర్కొన్న హీరోల లిస్టులో నితిన్ ముందు వరుసలో ఉంటాడు. 'సై'కి, 'ఇష్క్'కి మధ్యలో ఏకంగా 12 ఫ్లాప్ లు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత నుంచి ఒక హిట్, మూడు ఫ్లాప్ లు అన్నట్టుగా నితిన్ కెరీర్ సాగుతుంది. ఇక ఇప్పుడు అతను మళ్ళీ పూర్తిగా ట్రాక్ తప్పినట్టు కనిపిస్తున్నాడు.
నితిన్ తాజా చిత్రం 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్' డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే డివైడ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ కనీస ఓపెనింగ్స్ ని కూడా రాబట్టలేకపోయింది. నితిన్ గత చిత్రాలు ఫ్లాప్ అయినప్పటికీ చెప్పుకోదగ్గ ఓపెనింగ్స్ రాబట్టాయి. కానీ 'ఎక్స్ ట్రా' మాత్రం పూర్తిగా చేతులెత్తేసింది.
మొదటి రోజు రూ.1.96 కోట్ల షేర్, రెండో రోజు రూ.1.16 లక్షల షేర్ రాబట్టిన ఎక్స్ ట్రా చిత్రం.. రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.3.12 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. షో షోకి కలెక్షన్లు పడిపోవడం చూస్తుంటే ఫుల్ రన్ లో రూ.5 కోట్ల లోపు షేర్ కే పరిమితమయ్యే అవకాశముంది. అదే జరిగితే దాదాపు రూ.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ మూవీ.. రూ.20 కోట్ల దాకా నష్టాలను చూసే ఛాన్స్ ఉంది.
నితిన్ చివరగా 2020 ప్రారంభంలో వచ్చిన 'భీష్మ'తో హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత చెక్, రంగ్ దే, మాచర్ల నియోజకవర్గం సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచాయి. ఇప్పుడు 'ఎక్స్ ట్రా' కూడా అదే బాటలో పయనిస్తోంది. మరి నితిన్ తదుపరి సినిమాతోనైనా ఈ ఫ్లాప్ ల నుంచి బయటపడతాడేమో చూడాలి.