English | Telugu
స్టార్ హీరో సినిమా రేంజ్ లో చిన్న సినిమా కలెక్షన్స్!
Updated : Jun 30, 2023
చిన్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయాన్ని నమోదు చేసిన సందర్భాలు ఎన్నో చూశాము. అయితే ఒక చిన్న సినిమా, రీరిలీజ్ లో బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించడం మాత్రం చాలా అరుదు. అలాంటి అరుదైన ఘనతని సాధించింది 'ఈ నగరానికి ఏమైంది?' చిత్రం.
ఈ తరం యువతని విశేషంగా ఆకట్టుకున్న సినిమాలలో 'ఈ నగరానికి ఏమైంది?' ఒకటి. 'పెళ్ళి చూపులు' తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రమిది. బాక్సాఫీస్ దగ్గర 'పెళ్ళి చూపులు' స్థాయి విజయాన్ని అందుకోనప్పటికీ, 'ఈ నగరానికి ఏమైంది?' సినిమాకి ఎందరో అభిమానులున్నారు. స్మాల్ స్క్రీన్ మీద ఈ సినిమాని రిపీటెడ్ గా చూసేవాళ్ళు ఎందరో. సోషల్ మీడియాలో మీమ్స్ గాను ఈ సినిమాలో సీన్స్ ని, డైలాగ్స్ ని ఉపయోగిస్తుంటారు. అంతలా ఈ సినిమా యూత్ కి కనెక్ట్ అయింది. అయితే ఇప్పుడు ఈ సినిమా రీరిలీజ్ లో అదిరిపోయే కలెక్షన్స్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
'ఈ నగరానికి ఏమైంది?' సినిమా 2018 జూన్ 29న విడుదలైంది. ఈ జూన్ 29 తో ఈ సినిమా విడుదలై ఐదేళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా జూన్ 29న ఈ మూవీని రీరిలీజ్ చేశారు. మొదట్లో కొన్ని థియేటర్లలోనే ఈ సినిమా విడుదల చేయాలి అనుకోగా, అడ్వాన్స్ బుకింగ్స్ కి వచ్చిన ఊహించని రెస్పాన్స్ తో షోలను పెంచేశారు. మెజారిటీ షోలు ఫుల్ అయ్యాయి. ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు మార్నింగ్ షోలకి గాను రూ.20 లక్షలు కలెక్ట్ చేసిన ఈ సినిమా, రీరిలీజ్ లో మాత్రం మార్నింగ్ షోలకి ఏకంగా రూ.80 లక్షలు రాబట్టింది. ఇప్పటిదాకా రీరిలీజ్ లో మొదటిరోజు తెలుగు రాష్ట్రాల్లో కోటికి పైగా గ్రాస్ రాబట్టిన సినిమాలుగా పోకిరి, జల్సా, ఖుషి, ఒక్కడు, ఆరెంజ్, దేశముదురు, సింహాద్రి నిలిచాయి. ఈ ఏడు సినిమాలు కూడా స్టార్లు నటించిన సినిమాలు కావడం గమనార్హం. అయితే ఇప్పుడు వీటి సరసన ఈ నగరానికి ఏమైంది సినిమా చేరింది. ఈ మూవీ రీరిలీజ్ లో తెలుగు రాష్ట్రాల్లో కోటికి పైగా గ్రాస్ రాబట్టింది. ఒక చిన్న సినిమా రీరిలీజ్ లో ఈస్థాయి వసూళ్లు రాబట్టడం ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్యపరుస్తోంది.