English | Telugu
హీరోలు సెలెక్ట్ చేసిన కథలు హిట్... నేను సెలెక్ట్ చేసిన కథలు ఫ్లాప్!
Updated : Oct 10, 2023
సినిమా రంగంలో డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్‌ని ప్రారంభించి ఆ తర్వాత సహ నిర్మాతగా కొన్ని సినిమాలకు పనిచేసి ‘ఈరోజుల్లో’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు మారుతి. వినోదాత్మక చిత్రాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే మారుతి తన మొదటి సినిమాతోనే కొత్త ట్రెండ్ క్రియేట్ చేశాడు. ఆ సినిమా తర్వాత అలాంటి యూత్‌ఫుల్ సబ్జెక్ట్స్‌తో చాలా సినిమాలు వచ్చాయి. కొత్త డైరెక్టర్లకు మారుతి ఒక ఇన్‌స్పిరేషన్ అయ్యాడు. అయితే అతని కెరీర్‌లో హిట్స్‌తోపాటు ఫ్లాపులు కూడా ఉన్నాయి. ఎవరైనా హిట్ అవ్వాలనే సినిమాలు తీస్తారని, ఫ్లాప్ అవ్వడానికి ఎన్నో కారణాలు వుంటాయంటున్నాడు మారుతి. తను చేసిన కొన్ని సినిమాలు హిట్ అవ్వడానికి, కొన్ని ఫ్లాప్ అవ్వడానికి రీజన్స్ ఏమిటనే విషయాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు.
‘సాధారణంగా ఒక హీరోకి అతని ఇమేజ్‌కి తగ్గ కథ ఏమిటో సెలెక్ట్ చేసుకొని దాన్ని హీరోకి వినిపించి అతను ఓకే అంటే దాన్నే డెవలప్ చెయ్యడానికి ట్రై చేస్తాం. కొన్నిసార్లు కథ విషయాన్ని హీరోలు డైరెక్టర్లకే వదిలేసి నీకు ఏది నచ్చితే అది చేద్దాం అనే హీరోలు ఉంటారు. నేను చేసిన సినిమాల విషయానికి వస్తే హీరోలే సెలెక్ట్ చేసుకున్న కథలతో చేసిన సినిమాలు హిట్ అయ్యాయి. ప్రేమకథా చిత్రమ్, భలే భలే మగాడివోయ్, ప్రతిరోజూ పండగే వంటి సినిమాలే దానికి ఉదాహరణ. ఇక నిర్మాతగా కూడా కొన్ని ఇబ్బందులు పడ్డాను. మారుతి టాకీస్ బేనర్‌లో కొన్ని సినిమాలు చేశాను. కానీ, దానివల్ల నాకు నష్టమే జరిగింది. అందుకే ప్రస్తుతానికి దాన్ని పక్కనపెట్టాను.