English | Telugu

2 మిలియన్ క్లబ్ లో నాని 'దసరా'!

నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం 'దసరా' ఘన విజయం సాధించింది. రూ.49 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన ఈ మూవీ 12 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.61 షేర్ రాబట్టి నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా నైజాంలో, యూఎస్ లో ఈ చిత్రం అదిరిపోయే కలెక్షన్స్ తో సత్తా చాటుతోంది. నైజాంలో ఇప్పటిదాకా రూ.24 కోట్ల షేర్ కి పైగా రాబట్టిన దసరా.. యూఎస్ లో తాజాగా 2 మిలియన్ క్లబ్ లో చేరింది.

'దసరా' సినిమా యూఎస్ఏ లో 2 మిలియన్ డాలర్లకి పైగా గ్రాస్ వసూలు చేసినట్లుగా ఆ చిత్రాన్ని విడుదల చేసిన ప్రత్యంగిరా సినిమాస్ అధికారికంగా ప్రకటించింది. నాని కెరీర్ లో పలు 1 మిలియన్ సినిమాలు ఉన్నాయి కానీ, 2 మిలియన్ ఫీట్ సాధించిన మొదటి సినిమా దసరానే కావడం విశేషం. యువ హీరోల్లో వరుణ్ తేజ్, విజయ్ దేవరకొండ, నితిన్ ఇప్పటికే ఈ ఫీట్ సాధించగా.. ఇప్పుడు నాని కూడా ఆ లిస్టులో చేరిపోయాడు.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా సత్యన్ సూర్యన్, ఎడిటర్ గా నవీన్ నూలి వ్యవహరించారు.