English | Telugu
చంద్రబాబు అరెస్ట్ ఎఫెక్ట్: భగవంత్ కేసరి రిలీజ్ వాయిదా.. నిజమెంత?
Updated : Sep 16, 2023
మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారం.. ఆంధ్ర ప్రదేశ్ లో ఎంతటి సంచలనం సృష్టిస్తుందో తెలిసిందే. చంద్రబాబు నాయుడుకి బావమరిది, హిందూపూర్ ఎం.ఎల్.ఎ అయిన నటసింహం నందమూరి బాలకృష్ణ కూడా ఈ ఘటన అనంతరం గత కొద్ది రోజులుగా పూర్తిగా రాజకీయాలపై ఫోకస్ పెడుతున్నారు.
ప్రస్తుత రాజకీయ వాతావరణం చూస్తే.. బాలయ్య కొత్త చిత్రం 'భగవంత్ కేసరి' అనుకున్న సమయానికి థియేటర్స్ లోకి వస్తుందా? అనే అనుమానం రాకమానదు. సోషల్ మీడియాలోనూ ఇదే ముచ్చట సాగింది. ఈ క్రమంలోనే.. భగవంత్ కేసరి దసరా రేసు నుంచి తొలగిందంటూ కథనాలు కూడా వచ్చేశాయి. అయితే, ఈ వార్తల్లో నిజం లేదట. అనుకున్న ప్రకారంగానే.. అక్టోబర్ 19న విజయదశమికి ఈ సినిమా రావడం పక్కా అనే వినిపిస్తోంది. మేకర్స్ స్వయంగా ఈ విషయాన్ని చెప్పుకొచ్చారని టాక్. మరి.. సకాలంలోనే రాబోతున్న భగవంత్ కేసరి బాక్సాఫీస్ ముంగిట ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాడో చూడాలి.
ఇదిలా ఉంటే, భగవంత్ కేసరిలో బాలయ్యకి జోడీగా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. క్రేజీ బ్యూటీ శ్రీలీల ముఖ్య పాత్రలో దర్శనమివ్వనుంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ బాణీలు అందిస్తున్న ఈ సినిమాని వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్నారు.