English | Telugu
ఇంతటితో ఇది ఆగదంటున్న విజయ్ దేవరకొండ!
Updated : Sep 16, 2023
సొసైటీకి ఏదో చెయ్యాలని ఎప్పటి నుంచో ఉంది. కానీ, దానికి కావాల్సిన శక్తి, సంపాదన, స్థాయి, ధైర్యం కావాలి. అవన్నీ నాకు సమకూర్చిన అమ్మ నాన్నలకు, తెలుగు ప్రజలకు, నా టీమ్‌కి, ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇవన్నీ చెయ్యడానికి వెనుక రీజన్ ఎవ్వరికీ తెలీదు. నాకు నిన్నతనం నుంచే ఇలాంటి కార్యక్రమాలు చెయ్యాలని ఉండేది. నేను ఇంటర్ చదివే రోజుల్లో కాలేజ్ ట్రిప్‌కి అందరూ వెళ్ళారు. మా ఫ్యామిలీతో డబ్బు ఖర్చు పెట్టించడం ఇష్టం లేక వెళ్ళలేదు. తర్వాత నేను చాలా ఫీల్ అయ్యాను. ఇప్పుడు నేను సంపాదిస్తున్నాను కాబట్టి 100 మంది స్కూలు పిల్లలను ఫస్ట్ హాలీడే ట్రిప్‌కి పంపించాను. పిల్లల ఫీజుల విషయంలో కూడా తల్లిదండ్రులు ఎంతో ఇబ్బంది పడుతుంటారు. అది మా కుటుంబంలో కూడా చూశాను. అవన్నీ చూసిన నేను కొంతమందినైనా ఆ బాధ నుంచి విముక్తి చేయాలని ప్రయత్నిస్తున్నాను. నేను అందించే లక్ష రూపాయలు మీ లైఫ్‌లో కొంచెం సంతోషం, కొంచెం ఒత్తిడి నుంచి బయటపడడం, ఈ డబ్బు ఏదో ఒక పనికి ఉపయోగపడి మీకు కొంచెం అండగా ఉంటే నాకు చాలా తృప్తిగా ఉంటుంది. నాకు ఎవ్వరూ థాంక్స్ చెప్పొద్దు. ప్రస్తుతం నేను కేవలం 100 కుటుంబాలకు మాత్రమే సాయం చేయగలుగుతున్నాను. నేను వైజాగ్‌లో ప్రకటించిన వెంటనే మాకు దాదాపు 50వేలకు పైగా అప్లికేషన్స్ వచ్చాయి. ఆ 50వేల కుటుంబాల్లో మా టీమ్ ఇక్కడున్న 100 కుటుంబాలను ఎంపిక చేసింది. ఇంకా ఎంతోమందికి సాయం చేయాలని వుంది. ఇలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటాను’ అంటూ తన మనసుల్లో వున్న ఆలోచనల్ని ప్రేక్షకుల ముందుంచారు విజయ్ దేవరకొండ.
ఖుషి సక్సెస్ ఈవెంట్‌లో 100 మందికి ఒక్కొకరికి రూ.లక్ష అందిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన ప్రకటించినట్టుగానే ఎక్కువ సమయం తీసుకోకుండా 100 మంది లిస్ట్‌ని ప్రకటించారు. లిస్ట్ వెలువడిన వెంటనే జరిగిన ‘ఖుషి’ గ్రాండ్ సక్సెస్ ఈవెంట్‌లో ఎంపిక చేసిన 100 మందికి విజయ్ దేవరకొండ స్వయంగా చెక్కులు అందించారు.