Read more!

English | Telugu

ఈ వారం కూడా 'బలగం' సినిమాదే హవా!

బాక్సాఫీస్ దగ్గర ఒక్కోసారి చిన్న సినిమాలు అద్భుతాలు చేస్తుంటాయి. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన 'బలగం' సినిమా ఆ కోవలోకే వస్తుంది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 3న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు.. మంచి వసూళ్లను కూడా రాబడుతోంది. రూ.1.15 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ చిత్రం రెండు వారాలు తిరక్కుండానే రూ.6.5 కోట్లకు పైగా షేర్ రాబట్టి సత్తా చాటింది. ఇప్పటికీ విశేష ఆదరణ పొందుతోన్న బలగం.. ఈ వారం కూడా బాక్సాఫీస్ దగ్గర హవా చూపించేలా ఉంది.

ఈ శుక్రవారం రెండు చెప్పుకోదగ్గ సినిమాలు విడుదలవుతున్నాయి. అందులో ఒకటి నాగశౌర్య-శ్రీనివాస్ అవసరాల కలయికలో వస్తున్న హ్యాట్రిక్ ఫిల్మ్ 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' కాగా, రెండోది కన్నడలో రూపొందిన పాన్ ఇండియా ఫిల్మ్ 'కబ్జా'. అయితే ఈ రెండు సినిమాలకు ఎందుకనో రావాల్సినంత బజ్ రాలేదు. ముఖ్యంగా 'ఊహలు గుసగుసలాడే' వంటి సూపర్ హిట్ అందించిన నాగశౌర్య-శ్రీనివాస్ అవసరాల కాంబోలో వస్తున్న 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండాలి. క్లాస్ ఆడియన్స్ ఈ సినిమా చూడటానికి ఎక్కువ ఆసక్తి చూపించాలి. కానీ అడ్వాన్స్ బుకింగ్స్ ఏమాత్రం ఆశించిన స్థాయిలో లేదు. మౌత్ టాక్ మీదే ఈ సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంది. ఇక కబ్జా సినిమానైతే తెలుగులో పట్టించుకునే అవకాశాలు తక్కువే కనిపిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో బలగం చిత్రం తొమ్మిదో రోజైన గత శనివారం నాడు రూ.1.77 కోట్ల గ్రాస్, పదో రోజైన ఆదివారం రూ.2.36 కోట్ల గ్రాస్ రాబట్టిందని ట్రేడ్ వర్గాల అంచనా. వీక్ డేస్ లోనూ ఈ సినిమా మంచి వసూళ్లతో సత్తా చాటుతోంది. సోమవారం 67 లక్షలు, మంగళవారం 88 లక్షలు, బుధవారం 91 లక్షల గ్రాస్ రాబట్టింది. ముఖ్యంగా నైజాంలో బలగం చిత్రానికి విశేష ఆదరణ లభిస్తోంది. 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'కి పాజిటివ్ టాక్ రావడమో లేదా వచ్చే వారం కొత్త చిత్రాల తాకిడి వరకు బలగం జోరు కొనసాగే అవకాశముంది. ముఖ్యంగా నైజాంలో హవా చూపిస్తుంది అనడంలో సందేహం లేదు.