English | Telugu
రామ్ చరణ్ కుమార్తెకు అల్లు అర్జున్ కాస్ట్‌లీ గిఫ్ట్
Updated : Aug 4, 2023
కొణిదెల కుటుంబ సభ్యులు ఎంతో హ్యాపీగా ఉన్నారు. అందుకు కారణమేంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారింట్లోకి కొత్త మెంబర్ అడుగు పెట్టారు. అదెవరో కాదు.. క్లీంకార. రామ్ చరణ్, ఉపాసనల గారాల పట్టి. జూన్ 20న క్లీంకార మెగా ఇంట్లోకి అడుగు పెట్టింది. మెగా కుటుంబ సభ్యులు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. పాప పుట్టిన తర్వాత బారసాల వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు అందరూ పాల్గొన్నారు. ఖరీదైన బహుమతులను అందించారు. అయితే వీరిలో అల్లు అర్జున్ ఇచ్చిన ఖరీదైన గిఫ్ట్‌కు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ ఐకాన్ స్టార్ మెగా వారసురాలికి ఇచ్చిన బహుమానం ఏంటో తెలుసా!
వివరాల్లోకి వెళితే, క్లీంకార కోసం మెగా కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన వేడుకలో అల్లు అర్జున్ పాల్గొని క్లీంకారకు ఖరీదైన బంగారు పలకను బహుమతిగా ఇచ్చారట. అందులో ఆమె పుట్టినరోజు, పేరు వివరాలను కూడా చక్కగా వచ్చేలా ప్లాన్ చేసి మరీ గిఫ్ట్‌ను ఇచ్చారట అల్లు అర్జున్. మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్ దూరం పాటిస్తున్నారనే వార్తలకు ఈ విషయంతో చెక్ పడింది. ఎందుకంటే రామ్ చరణ్, ఉపాసనలు హాస్పిటల్‌లో ఉన్నప్పుడు అల్లు అర్జున్ అపోలోకి వెళ్లి మరీ ప్రత్యేకంగా పలకరించారు. అందుకు ముందు సీమంతం వేడుకలోనూ పాల్గొన్నారు. పాప పుట్టిన తర్వాత కూడా వెళ్లి బంగారు పలకను బహుమతిగా ఇచ్చారు మరి.
క్లీంకార పేరుని లలిత సహస్త్రనామం నుంచి తీసుకుని పెట్టారు. చైతన్యానికి, ప్రకృతి స్వరూపానికి, పవిత్రతను సూచించే పేరును పాపకు పెట్టారు మెగా ఫ్యామిలీ మెంబర్స్. పాప పుట్టటం లక్ష్మీదేవి పుట్టినట్లుగా భావిస్తున్నామని చిరంజీవి సైతం మీడియా ముఖంగా చెప్పిన సంగతి తెలిసిందే.