English | Telugu
అజిత్, ధనుష్ కాంబో సినిమా... పట్టాలెక్కలేదా?
Updated : Aug 18, 2023
కొన్ని కాంబినేషన్ల గురించి వినడం కూడా ఆనందంగా ఉంటుంది. అలాంటి కాంబో అజిత్ అండ్ ధనుష్. వీరిద్దరితో సినిమా చేయాలని సెల్వరాఘవన్ అనుకున్నారట. ఈ మూవీలో ఓ స్పెషల్ రోల్ కోసం నటుడు ప్రేమిస్తే భరత్‌ని కూడా అడిగారట. ఇంతకన్నా గొప్ప అవకాశం ఎక్కడొస్తుందని వెంటనే ఓకే చెప్పేశారట భరత్. అయితే సినిమా ప్రారంభం కావడానికి ముందే ఆగిపోయినట్టు సమాచారం.
అజిత్, ధనుష్ ఇద్దరూ తమిళనాడులో చాలా పాపులర్ హీరోలు. అక్కడ ఇద్దరు హీరోలు కలిసి సినిమాలు చేసే సంస్కృతి ఇప్పుడైతే లేదు. అయితే అది నెరవేరితే బావుంటుందని అనుకున్నారట సెల్వరాఘవన్. దీని గురించి నటుడు భరత్ మాట్లాడారు. ``సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటించడమంటే క్లాసులకు వెళ్లినట్టే. చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అలా నేర్చుకునే అవకాశం దొరికిందని అనుకున్నాను. అందులో సెట్లో అజిత్, ధనుష్ ఉంటే తప్పకుండా చాలా విషయాలు తెలుసుకోవచ్చని భావించాను. కానీ ఆ సినిమా మెటీరియలైజ్ కాలేదు`` అని అన్నారు.
అజిత్ తో మాత్రమే కాదు రజనీకాంత్, కమల్‌హాసన్, విజయ్‌తోనూ చాలా స్క్రిప్టులు డిస్కస్ చేశారు సెల్వరాఘవన్. అయితే అవేమీ మెటీరియలైజ్ కాలేదు. మధ్యలోనే ఆగిపోయాయి. ఆ మాటంటే సెల్వరాఘవన్ ఒప్పుకోరు. ``నా దృష్టిలో సినిమాకు పూజ చేసి, మొదలుపెట్టి, షెడ్యూళ్లు కూడా పూర్తయ్యాక ఆగిపోతే ఆగిపోయినట్టు. మాటల్లో ఉన్న సినిమా ఆగిపోయిందని ఎవరైనా ఎలా అంటారు? అలా అన్నా నేను ఊరుకుంటానా? `` అని అంటారు సెల్వరాఘవన్.