English | Telugu

'మిస్టర్ ప్రెగ్నెంట్' రివ్యూ.. కథ వేరుంటది.. సోహెల్ హిట్ కొట్టాడా?

సినిమా పేరు: మిస్టర్ ప్రెగ్నెంట్
తారాగణం: సొహెల్, రూపా కొడువయూర్, సుహాసిని, వైవా హర్ష, బ్రహ్మాజీ, అభిషేక్, రాజా రవీంద్ర
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్
సినిమాటోగ్రాఫర్: నిజార్ షఫీ
ఎడిటర్: పవన్ పూడి
రచన, దర్శకత్వం : శ్రీనివాస్ వింజనంపాటి
నిర్మాతలు: అప్పిరెడ్డి, సజ్జల రవిరెడ్డి, వెంకట్ అన్నపురెడ్డి
బ్యానర్: మైక్ మూవీస్
విడుదల తేదీ: ఆగస్టు 18, 2023

బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ వరుస సినిమాలు చేస్తూ హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. 'కథ వేరుంటది' అంటూ బిగ్ బాస్ లో సందడి చేసిన అతను, ఇప్పుడో విభిన్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అదే 'మిస్టర్ ప్రెగ్నెంట్'. తన గత చిత్రాలు 'లక్కీ లక్ష్మణ్', 'ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు' చిత్రాలతో మెప్పించలేకపోయిన సోహెల్.. ఈ సినిమాతోనైనా హిట్ కొట్టాడా?...

కథ:
టాటూ ఆర్టిస్ట్ గౌతమ్(సోహెల్)ని మహి(రూప) ఎంతగానో ప్రేమిస్తుంది. కానీ ప్రేమ, పెళ్లి, పిల్లలకు దూరంగా ఉండాలనుకున్న గౌతమ్.. ఆమె ప్రేమని రిజెక్ట్ చేస్తాడు. అయితే ఒకసారి తాగిన మైకంలో పిల్లలు వద్దనుకుంటే పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. ఆ మాటని సీరియస్ గా తీసుకున్న మహి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవడానికి కూడా సిద్ధపడుతుంది. దీంతో మహి ప్రేమను అర్థం చేసుకున్న గౌతమ్ ఆమెను పెళ్లి చేసుకుంటాడు. అయితే అసలు పిల్లలే వద్దనుకున్న గౌతమ్ తానే గర్భం మోయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? 'మిస్టర్ ప్రెగ్నెంట్'గా అతను ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:
మగవారు గర్భం దాల్చే అవకాశం లేకపోయినా, భార్య గర్భాన్ని మోయవచ్చు అనేది ఇప్పటికే ఆస్ట్రేలియాలో థామస్ అనే వ్యక్తి ద్వారా రుజువైంది. ఆ పాయింట్ ని తీసుకొని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా కథను రాసుకున్నాడు దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి. ముందుగా దర్శకుడు ఎంచుకున్న కథాంశాన్ని, అతని ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి.

సినిమా చాలా నెమ్మదిగా ప్రారంభమవుతుంది. మొదటి 20-30 నిమిషాలు రొటీన్ గా, నెమ్మదిగా సాగుతుంది. గౌతమ్-మహి ప్రేమ సన్నివేశాలు, హాస్య సన్నివేశాలు పెద్దగా మెప్పించవు. గౌతమ్-మహి పెళ్లి తర్వాత మాత్రం కథలో వేగం పెరుగుతుంది. ఇంటర్వెల్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ మెరుగ్గా ఉంది. ఎమోషనల్ సన్నివేశాలు పండటంతో పాటు ఎంటర్టైన్మెంట్ వర్కౌట్ అయింది. ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో ఆడవారు పడే బాధలు, అమ్మ గొప్పతనాన్ని తెలుపుతూ వచ్చే సన్నివేశాలు, సంభాషణలు కట్టిపడేసేలా ఉన్నాయి.

ఈ సినిమాకి కథ, సోహెల్ నటన, సెకండాఫ్ బలంగా నిలిచాయి. గత చిత్రాలతో పోలిస్తే సోహెల్ నటనలో పరిణితి కనిపించింది. ప్రారంభ సన్నివేశాలపై మరింత శ్రద్ధ పెట్టి, కాస్త నిడివిని కుదించి ఉంటే అవుట్ పుట్ ఇంకా బెటర్ గా ఉండేది.

తెలుగువన్ పర్‌స్పెక్టివ్:
సినిమా నెమ్మదిగా ప్రారంభమైనా.. విభిన్న కథాంశం, భావోద్వేగ సన్నివేశాలతో ఆకట్టుకునేలా సాగింది. కొత్త కథలను ఇష్టపడే వారు ఈ సినిమాని ట్రై చేయొచ్చు.

రేటింగ్: 2.5/5