English | Telugu
సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సుహాసిని మణిరత్నం తనయుడు!
Updated : Jul 12, 2023
మళ్లీ మళ్లీ ఇది రాని రోజు అంటూ మరపురాని ఎన్నెన్నో సినిమాల్లో నటించారు సుహాసిని. ఆమెను చూసిన వారు ఎవరైనా సరే, తెలుగు నటి కాదు అంటే ఒప్పుకోరు. అంతగా తెలుగు సినిమాల్లో లీనమై నటించారు. ఆమె భర్త మణిరత్నం లెజెండరీ డైరక్టర్. అరవై ఏళ్లు దాటినా అదే ఉత్సాహంతో సినిమాలు తీస్తున్నారు. ఇటీవల విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యారాయ్, త్రిష, ప్రకాష్‌రాజ్‌తో ఆయన తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ రెండు పార్టులు అద్భుతమైన విజయం సాధించాయి. ఈ సినిమాలకు ఆయన ఇంటి నుంచి పనిచేసింది ఆయన మాత్రమే కాదు. సుహాసిని కూడా. సినిమాను ఎంతగానో ప్రేమించి, మణిరత్నం వెంటే ఉంటూ ప్రమోట్ చేశారు.
వీరిద్దరు కాకుండా మణి ఫ్యామిలీ నుంచి మరొకరు కూడా ఈ సినిమా కోసం ఫారిన్ నుంచి పనిచేశారన్నది కోలీవుడ్‌లో వైరల్ అవుతున్న వార్త. పొన్నియిన్ సెల్వన్ చాప్టర్ ఒన్, పొన్నియిన్ సెల్వన్ చాప్టర్2 సినిమాకు సుహాసిని, మణిరత్నం తనయుడు నందన్ కూడా పనిచేశారట. లైకా ప్రొడక్షన్స్ తో అసోసియేట్ అయ్యారట నందన్. ఆల్రెడీ పొన్నియిన్ సెల్వన్ రెండు పార్టుల కోసం దాదాపు 500 కోట్ల నిధులను మొబిలైజ్ చేశారట నందన్. 1992లో పుట్టారు నందన్. అబ్రాడ్‌లో చదువుకున్నారు. లెనినిజమ్ మీద పుస్తకం కూడా రాశారు నందన్. ఇప్పటిదాకా ఆయన ఏ సినిమా వేడుకలోనూ కనిపించలేదు.
వరల్డ్ హిస్టరీ అంటే నందన్‌కి ప్రాణం అని సుహాసిని పలుమార్లు చెబుతుంటారు. సినిమాలపట్ల తన ఆసక్తి ఎలా ఉంటే, అలా చేస్తామని చెప్పేవారు. ఇప్పుడున్న డెవలప్‌మెంట్స్‌ని బట్టి, నందన్ మెడ్రాస్ టాకీస్ నిర్వహణను చూసుకుంటారని తెలుస్తోంది. మెడ్రాస్ టాకీస్ మీద వరుసగా సినిమాలు చేస్తున్నారు మణిరత్నం. త్వరలోనే కమల్‌హాసన్‌తో ఓ సినిమా చేస్తారు. ఆ తర్వాత శింబు 50 చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా ప్రొడక్షన్ పనులన్నీ నందన్ దగ్గరుండి చూసుకుంటారని టాక్.