English | Telugu

ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు.. అయినా ఎన్టీఆర్ బావమరిదికి వరుస ఆఫర్స్!

ఇంతవరకు హీరోగా నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ కి ప్రముఖ నిర్మాణ సంస్థల్లో వరుస అవకాశాలు రావడం ఆసక్తికరంగా మారింది. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి ప్రణతికి నితిన్ సోదరుడు. 'శతమానం భవతి' ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నితిన్ మొదటి సినిమా 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు' రూపొందింది. సినిమా షూటింగ్ పూర్తయింది, గతేడాది ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. కానీ ఎందుకనో ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు. అయినప్పటికీ ప్రముఖ నిర్మాణ సంస్థల్లో నితిన్ కి వరుస అవకాశాలు వస్తున్నాయి.

సితార ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ లో నితిన్ ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే చిత్రీకరణ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుగుతోంది. నవంబర్ లేదా డిసెంబర్ లో ఈ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇదే నితిన్ మొదటి సినిమాగా విడుదల కానుందట. ఎంట్రీ గ్రాండ్ గా ఉండాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారని వినికిడి. మరి 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు'ని ఆలస్యంగానైనా విడుదల చేస్తారో లేదో చూడాలి. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ డెబ్యూ విషయంలో కూడా ఇలాగే జరిగింది. అతను నటించిన మొదటి సినిమా 'రేయ్' రెండో సినిమాగా విడుదల కాగా, రెండో సినిమాగా చేసిన 'పిల్లా నువ్వులేని జీవితం' ముందుగా విడుదలైంది.

ఇదిలా ఉంటే గీతా ఆర్ట్స్ లోనూ నితిన్ ఓ సినిమా చేయనున్నాడు. జీఏ2 పిక్చర్స్ బ్యానర్ లో రూపొందనున్న ఈ సినిమాతో అనిల్ రావిపూడి వద్ద దర్శకత్వ విభాగంలో పనిచేసిన యువ ప్రతిభావంతుడు దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడట. ఈ మూవీ రేపు(జూన్ 13న) ఉదయం పూజ కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం కానుందని సమాచారం. అంతేకాదు ఈ సినిమాలో నితిన్ కి జోడిగా శ్రీలీల నటించనుందని టాక్.