English | Telugu
మరో సీక్వెల్ లో నిఖిల్.. మళ్ళీ పాన్ ఇండియా హిట్ కొడతాడా!
Updated : Jul 12, 2023
కొంతకాలంగా సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తన హిట్ ఫిల్మ్ 'కార్తికేయ'కు సీక్వెల్ గా తెరకెక్కిన 'కార్తికేయ 2'తో గతేడాది పాన్ ఇండియా సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు నిఖిల్ తన మరో హిట్ ఫిల్మ్ సీక్వెల్ లో నటించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమా ఏదో కాదు 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'.
నిఖిల్ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'. మేఘన ఆర్ట్స్ బ్యానర్ పై పి. వి. రావు నిర్మించిన ఈ చిత్రంలో హెబ్బా పటేల్, నందిత శ్వేత, అవికా గోర్ ముఖ్య పాత్రలు పోషించారు. 2016 నవంబరులో విడుదలైన ఈ మూవీ రూ.30 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి ఘన విజయం సాధించింది. 'కార్తికేయ 2' రాకముందు నిఖిల్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం ఇదే కావడం విశేషం. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నిఖిల్, విఐ ఆనంద్ కలయికలో రానున్న ఈ 'ఎక్కడికి పోతావు చిన్నవాడా-2' జీఏ2 పిక్చర్స్ బ్యానర్ లో రూపొందనుందని సమాచారం.
ఇటీవల 'స్పై' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన నిఖిల్ చేతిలో 'స్వయంభు', 'ది ఇండియన్ హౌస్' సినిమాలు ఉన్నాయి. అలాగే సుధీర్ వర్మ దర్శకత్వంలోనూ ఓ సినిమా కమిట్ అయ్యాడు. ఈ సినిమాల తర్వాత 'ఎక్కడికి పోతావు చిన్నవాడా-2' పట్టాలెక్కే అవకాశముంది. మరోవైపు దర్శకుడు విఐ ఆనంద్ కూడా సందీప్ కిషన్ హీరోగా 'ఊరుపేరు భైరవకోన' అనే సినిమా చేస్తున్నాడు. ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యాక 'ఎక్కడికి పోతావు చిన్నవాడా-2'పై దృష్టి పెట్టనున్నాడని అంటున్నారు.