English | Telugu
సీనియర్ నటి గౌతమికి బెదిరింపు కాల్స్!
Updated : Sep 14, 2023
సీనియర్ నటి గౌతమికి నమ్మిన వ్యక్తి అనుకోని షాక్ ఇచ్చారు. ఏకంగా కోట్ల రూపాయల విలువైన ఆస్తిని కాజేశారు. అయితే ఆమె మోసపోయిన తర్వాత విషయాన్ని గ్రహించారు. వెంటనే పోలీసులను సంప్రదించారు. వివరాల్లోకి వెళితే, గౌతమి నటిగా ఫుల్ బిజీగా ఉంటోన్న సమయంలో ఆళగప్పన్ అనే వ్యక్తిని తన ఆస్తులకు పవర్ ఏజెంట్‌గా నియమించుకున్న సంగతి తెలిసిందే. అతను గౌతమి సంతకాలను ఫోర్జరీ చేసి రూ. 25 కోట్ల ఆస్తులను ఆక్రమించుకున్నారు. ఈ విషయంపై గౌతమి చెన్నై కమీషనర్ ఆఫీసులో ఫిర్యాదు చేశారు.
2009లో ఆమె తిరువణ్ణామలైలో నాలుగు ఎకరాల భూమిని రూ.48 లక్షలు పెట్టి కొనుగోలు చేశారు. అయితే ఇప్పుడు ఆ భూమి విలువ కోట్ల రూపాయల విలువ పలుకుతుంది. సదరు భూమిని ఆళగప్పన్, ఆయన భార్య కలిసి ఆక్రమించుకున్నారని తిరువణ్ణామలై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఆమె కంప్లైంట్ చేశారు. తనను , తన కూతురుని చంపేస్తామని వార్నింగ్ కూడా ఇస్తున్నారని పోలీసులకు తెలిపారు నటి గౌతమి. దీంతో పోలీసులు ఆళగప్పన్, ఆయన భార్యను స్టేషన్‌కి పిలిచి విచారించారు. ఈ కేసుకి సంబంధించి మరిన్ని వివరాలను ప్రకటించటానికి ఈ నెల 29న తిరువణ్ణామలై పోలీస్ స్టేషన్‌కు వెళుతున్నట్లు గౌతమి సన్నిహిత వర్గాలు తెలియజేస్తున్నాయి. మరి ఈ విషయంపై ఆళగప్పన్ ఆమె కుటుంబ సభ్యులు ఎలా స్పందిస్తారనే చూడాలి మరి.
పలు తెలుగు, తమిళ చిత్రాల ద్వారా మెప్పించిన నటి గౌతమి 2004లో క్యాన్సర్ బారిన పడ్డారు. అయితే దాన్ని ఆమె జయించి మళ్లీ ఆరోగ్యవంతంగా మారారు, నటుడు కమల్ హాసన్‌తో కలిసి ఉంటున్న ఆమె ఈ మధ్య కాలంలో ఆయనతోనూ దూరంగా ఉంటున్నారు.