English | Telugu
పవన్ కళ్యాణ్ కి ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు.. నాజర్ షాకింగ్ కామెంట్స్!
Updated : Jul 27, 2023
తమిళ సినిమాల్లో తమిళ వారికి మాత్రమే అవకాశాలు ఇవ్వాలంటూ 'ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా'(ఫెఫ్సీ) కొత్త నిబంధనను తీసుకొచ్చిందని ఇటీవల వార్తలు వినిపించాయి. ఈ విషయాన్ని పలువురు తప్పుబట్టారు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'బ్రో' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని హితవు పలికారు. తెలుగు పరిశ్రమ లాగే తమిళ పరిశ్రమ కూడా అన్ని భాషల వారికి అవకాశం ఇవ్వాలని, అప్పుడే 'ఆర్ఆర్ఆర్' లాంటి ప్రపంచస్థాయి సినిమాలు చేయగలుగుతారని సూచించారు. దీంతో ఈ అంశం ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. అయితే తాజాగా ఈ అంశంపై సీనియర్ నటుడు, నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ స్పందించారు. అసలు ఫెఫ్సీ అలాంటి నిబంధన తీసుకురాలేదని, పవన్ కళ్యాణ్ కి ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
"తమిళ పరిశ్రమలో ఇతర భాషలకు చెందిన వారు పని చేయకూడదనే నియమాలు పెట్టారని ప్రచారం జరుగుతోంది. అందులో వాస్తవం లేదు. ఒకవేళ అలాంటి నిబంధన తీసుకువస్తే ముందు నేనే వ్యక్తిరేకిస్తాను. కళాకారులుకు సరిహద్దులు ఉండవు. పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయాన్ని స్టేజ్ మీద చెప్పారు. ఆయనకు ఎవరో తప్పుడు సమాచారాన్ని అందించి ఉంటారు. తమిళ సినీ కార్మికుల కోసం సెల్వమణి గారు కొన్ని సూచనలు చేశారు. తమిళ సినిమా చేస్తున్నప్పుడు తమిళ టెక్నీషియన్లను పెట్టుకోమని సూచించారు. అంతే కానీ ఇతర భాషలకు చెందినవారికి తీసుకోవద్దని ఎవ్వరూ చెప్పలేదు. ఇప్పుడన్నీ పాన్ ఇండియన్ సినిమాలు అయ్యాయి. ఇలాంటి టైంలో అలాంటి నిబంధనలు ఎవరు తీసుకొస్తారు. ఇతర భాషల నుంచి వచ్చిన ఎంతో మంది నటినటులను, టెక్నీషియన్లను తమిళ పరిశ్రమ అక్కున చేర్చుకుంది." అంటూ ఈ అంశంపై నాజర్ క్లారిటీ ఇచ్చారు.