English | Telugu
దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో కుమారుడు!
Updated : Aug 28, 2023
సినీ పరిశ్రమలో వారసుల ఎంట్రీ చాలా సాధారణ విషయం. ఎందరో స్టార్ హీరోల కుమారులు హీరోలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. అయితే కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కుమారుడు మాత్రం హీరోగా కాకుండా దర్శకుడిగా పరిచయమవుతుండటం ఆసక్తికరంగా మారింది.
విజయ్ తనయుడు జాసన్ సంజయ్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఇటీవల వార్తలు వినిపించాయి. ఆ వార్తలను నిజం చేస్తూ తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది. జాసన్ సంజయ్ ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ డైరెక్టర్ గా పరిచయం చేస్తోంది. జాసన్ సంజయ్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా, గర్వంగా ఉందని, అతని కెరీర్ విజయవంతంగా సాగాలని కోరుకుంటున్నామని తెలిపిన లైకా సంస్థ.. జాసన్ సంజయ్ తో ఇప్పటికే అగ్రిమెంట్ చేసుకున్నట్లుగా తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఫోటోలను పంచుకుంది. ఈ సినిమా నటీనటులతో పాటు ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. మరి తండ్రి బాటలో కాకుండా దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్న జాసన్ సంజయ్ ఏస్థాయి సక్సెస్ ని అందుకుంటాడో చూడాలి.