English | Telugu
ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉన్నాను!
Updated : Mar 7, 2023
'కేరాఫ్ కంచరపాలెం' దర్శకుడు వెంకటేష్ మహా పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 'కేజీఎఫ్' వంటి భారీ చిత్రాలపై విమర్శలు చేయడమే దానికి కారణం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ భారీ వసూళ్ళు రాబడుతున్న కమర్షియల్ సినిమాలను పాప్ కార్న్ సినిమాలని అన్నారు. వాటిని పాప్ కార్న్ తింటూ చూడొచ్చని, మధ్యలో సీన్ మిస్ అయినా పరవాలేదని కామెంట్స్ చేశారు. ముఖ్యంగా కేజీఎఫ్ సినిమాని ఆయన టార్గెట్ చేశారు. కథ, హీరో పాత్ర, హీరో తల్లి పాత్రపై దారుణ వ్యాఖ్యలు చేశారు. దీంతో కేజీఎఫ్ సినిమాని, కమర్షియల్ సినిమాలను ఇష్టపడే వారు వెంకటేష్ మహాను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి కానీ చులకన వ్యాఖ్యలు చేయకూడదని మండిపడుతున్నారు. ముఖ్యంగా కేజీఎఫ్ సినిమా గురించి మాట్లాడే క్రమంలో ఆయన ఉపయోగించిన భాషపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వెంకటేష్ మహా స్పందించారు.
తనపై వస్తున్న విమర్శలకు ఓ వీడియో ద్వారా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు వెంకటేష్ మహా. "ఇప్పటికీ నేను నా అభిప్రాయానికే కట్టుబడి ఉన్నాను. అయితే ఆ సమయంలో నేను ఉపయోగించిన భాష సరైనదని కాదని అంగీకరిస్తున్నాను. ఒక బాధ్యతగల దర్శకుడిగా నేను ఆ భాష వాడి ఉండకూడదు. నేను వాడిన భాష విషయంలో క్షమాపణలు చెబుతున్నాను. ఏదైనా ఒక సినిమానో, ఒక భాషకు చెందిన పరిశ్రమనో కించపరచాలన్న ఉద్దేశం నాకు లేదు. ఎన్నో మంచి సినిమాలు వస్తున్నాయి.. ప్రేక్షకులు వాటిని కూడా ఆదరిస్తే బాగుంటుంది అని చెప్పదలుచుకున్నాను" అని వెంకటేష్ మహా చెప్పుకొచ్చారు.