English | Telugu
'సలార్'లో మరో ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్.. బాక్సాఫీస్ షేకే!
Updated : Nov 15, 2023
అసలే పాన్ ఇండియా స్టార్ నటిస్తున్న భారీ యాక్షన్ ఫిల్మ్. దానికితోడు మరో ఇద్దరు పాన్ ఇండియా స్టార్లు తోడైతే ఇంకేమైనా ఉందా!. ఇప్పుడు 'సలార్' విషయంలో అదే జరగబోతుంది అంటున్నారు. ఇందులో ఇద్దరు పాన్ ఇండియా స్టార్ల సర్ప్రైజ్ ఎంట్రీ ఉంటుందట.
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రూపుదిద్దుకుంటున్న బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్ 'సలార్'. హోంబలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం సీజ్ ఫైర్ ఈ డిసెంబర్ 22న రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. డిసెంబర్ 1న విడుదల కానున్న ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ సినిమాకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది.
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గత చిత్రం యశ్ తో చేసిన 'కేజీఎఫ్' కాగా, తదుపరి చిత్రం జూనియర్ ఎన్టీఆర్ తో చేయనున్నాడు. అయితే ఇప్పుడు సలార్ కోసం ఈ ఇద్దరినీ రంగంలోకి దింపుతున్నాడట. ఈ సినిమా క్లైమాక్స్ లో యశ్ స్పెషల్ రోల్ లో కొద్ది నిమిషాలు మెరుస్తాడట. అలాగే ఇందులో ఎన్టీఆర్ కనిపించకుండా, వినిపిస్తాడట. ఎన్టీఆర్ ఫేస్ ని రివీల్ చేయకుండా, ఆయన వాయిస్ తో సినిమాని ముగిస్తారట.
ప్రశాంత్ నీల్, సినిమాటిక్ యూనివర్స్ ప్లాన్ చేస్తున్నాడని ఎప్పటినుంచో ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. తాజా న్యూస్ ని బట్టి చూస్తే, అది నిజమే అనిపిస్తోంది. 'సలార్'ని 'కేజీఎఫ్'తో ముడిపెడుతూ యశ్ ని రంగంలోకి దింపడం, అలాగే ఎన్టీఆర్ పాత్రని వాయిస్ తో పరిచయం చేయడం చూస్తుంటే.. బిగ్గెస్ట్ సినిమాటిక్ యూనివర్స్ కి తెరదీస్తున్నారని అర్థమవుతోంది.
'బాహుబలి'తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఇక 'కేజీఎఫ్'తో యశ్, 'ఆర్ఆర్ఆర్'తో ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అలాంటిది ఈ ముగ్గురు కలిస్తే బాక్సాఫీస్ షేక్ అవుతుంది అనడంలో సందేహం లేదు.