English | Telugu
నయనతార గుజరాతీ ప్రాజెక్ట్ శుభ్ యాత్ర
Updated : Apr 5, 2023
నయనతార గుజరాతీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఆ మూవీకి శుభ్ యాత్ర అని పేరు పెట్టారు. ఈ సినిమా పోస్టర్ కూడా ఇటీవల విడుదల చేశారు. మల్హర్ థాకర్ హీరోగా నటిస్తున్నారు. అయితే నయనతార ఇందులో నాయికగా నటించడం లేదు. ప్రాజెక్ట్ ఆమెదే అంటూ అర్థం ఆమె నిర్మిస్తున్నారని. నేషనల్ అవార్డు అందుకున్న దర్శకుడు మనీష్ శైనీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగువారికి కూడా సుపరిచితమైన మోనాల్ గజ్జర్ నాయిక. దర్శన్ జరీవాలా, హేమిన్ త్రివేది, మంగన్ లుహార్ కీ రోల్స్ చేస్తున్నారు. సౌత్ ఇండియా నుంచి సెలబ్రిటీ కపుల్ గుజరాత్ సినిమాను నిర్మించడం ఇదే తొలిసారి. తమ రౌడీ పిక్చర్స్ పతాకంపై నయనతార, విఘ్నేష్ శివన్ ఈ తొలి అడుగు వేశారు. నయనతారతో పనిచేయడం గురించి థాకర్ మాట్లాడుతూ ``ఆమెతో పనిచేయడం చాలా అద్భుతమైన భావన. విలువలున్న అంశాలను ఎంపిక చేసుకుని సినిమాలు నిర్మిస్తున్నారు. అంత అనుభవం ఉన్న నటీమణి నిర్మిస్తున్న సినిమాలో నటించడం అదృష్టంగా భావిస్తున్నా`` అని అన్నారు.
గత చిత్రాలతో పోలిస్తే, ఇందులో వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్నట్టు మల్హర్ చెప్పారు. ఆయన మాట్లాడుతూ ``నేనిప్పటిదాకా చేసిన సినిమాలన్నిటిలోకీ ఈ సినిమా చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. నా యాక్టింగ్ స్టైల్‌కి పక్కాగా సూట్ అయ్యే పాత్రను ఇందులో చేశాను. ఇందులో నా పాత్ర పేరు మోహన్. ఎప్పటికప్పుడు పాత్రలతో ప్రయోగాలు చేయడానికి ఆసక్తి చూపించే నాకు, ఈ కేరక్టర్‌ని ఆఫర్ చేసినందుకు నయనతారకు ధన్యవాదాలు`` అని అన్నారు. ఓ వైపు నటిగా, ఉయిర్, ఉలగం అనే ఇద్దరు అబ్బాయిలకు తల్లిగా తన కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నారు నయనతార. ఈ ఏడాది జవాన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాతో గుజరాత్‌లో నిర్మాతగా అడుగుపెడుతున్నారు. 2023లోనే శుభ్ యాత్రను విడుదల చేయనున్నారు రౌడీ కపుల్.