English | Telugu
ఎన్టీఆర్ 'బాద్‍షా'గా అలరించి నేటికి పదేళ్ళు!
Updated : Apr 5, 2023
జూనియర్ ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్ జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'బాద్‍షా'. పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మించిన ఈ చిత్రం 2013 ఏప్రిల్ 5 న విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమాకి రికార్డు స్థాయి ఓపెనింగ్స్ వచ్చాయి. ఫుల్ రన్ లో రూ.48 కోట్ల షేర్ రాబట్టిన ఈ మూవీ కలెక్షన్ల పరంగా అప్పటికి ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సూపర్ హిట్ ఫిల్మ్ విడుదలై నేటితో పదేళ్లు పూర్తయింది.
యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన 'బాద్‍షా' మూవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో ఎన్టీఆర్ ఓ వైపు బాద్‍షా గా యాక్షన్ తో, మరోవైపు రామ్ గా ఎంటర్టైన్మెంట్ తో రెండు విభిన్న కోణాలున్న పాత్రను పోషించి అలరించాడు. ఫస్టాఫ్ లో ఎన్టీఆర్, కాజల్, వెన్నెల కిషోర్ మధ్య వచ్చే సన్నివేశాలు అలరిస్తాయి. ఇక సెకండాఫ్ లో బ్రహ్మానందం ఎంట్రీ తర్వాత కామెడీ పీక్స్ కి వెళ్తుంది. డ్రీమ్ మిషన్ పేరుతో బ్రహ్మిని బకరాని చేసి ఎన్టీఆర్ ఆడుకునే సన్నివేశాలు థియేటర్లలో నవ్వులు పూయించాయి. ఇప్పటికీ 'బాద్‍షా' సినిమాలోని కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూనే ఉన్నాయి. ఈ సినిమాకి మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించగా.. సిద్ధార్థ్ ప్రత్యేక పాత్రలో కనిపించడం విశేషం.
'బాద్‍షా' సినిమాకి తమన్ అందించాడు. 'సైరో సైరో', 'డైమండ్ గర్ల్', 'బంతిపూల జానకి', 'వెల్కమ్ కనకం' ఇలా తమన్ స్వరపరిచిన పాటలన్నీ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి కథ గోపీమోహన్, కోన వెంకట్ అందించగా.. సినిమాటోగ్రాఫర్ గా కె.వి. గుహన్, ఎడిటర్ గా ఎం.ఆర్. వర్మ వ్యవహరించారు. సుహాసిని, ముకేష్ రిషి, ఆశిష్ విద్యార్థి, నవదీప్, కెల్లీ డార్జ్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, చంద్రమోహన్, తనికెళ్ళ భరణి తదితరులు ఈ చిత్రంలో నటించారు. 'పెళ్లి చూపులు'తో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రీతు వర్మ ఈ సినిమాలో కాజల్ కి సోదరిగా కనిపించడం మరో విశేషం.