English | Telugu
హిట్ కోసం నాగ చైతన్య ప్రయత్నాలు
Updated : Aug 4, 2023
అక్కినేని నేటి తరం నట వారసుడు నాగ చైతన్యకు మంచి హిట్ వచ్చి చాలా కాలమే అవుతుంది. మంచి ఆశలను పెట్టుకున్నకస్టడీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో ఇప్పుడీ హీరో తన నెక్ట్స్ మూవీపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఎలాగైనా హిట్ దక్కించుకోవాలని తెగ కష్టపడుతున్నారని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే, నాగ చైతన్య తన తదుపరి చిత్రాన్ని చందు మొండేటి దర్శకత్వంలో చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన చర్చలు, ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై సినిమాను రూపొందించనున్నారు.
ప్రేమమ్, సవ్యసాచి సినిమాల తర్వాత చైతన్య, చందు మొండేటి కాంబినేషన్‌లో సినిమా రూపొందబోయే మూడో సినిమా ఇదే. దీన్ని పీరియాడిక్ జోనర్‌లో తెరకెక్కించబోతున్నారు. పీరియాడిక్ మూవీగా తెరకెక్కబోతున్న ఈ సినిమా శ్రీకాకుళం, గుజరాత్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కనుంది. సినిమాకు తండేలు అనే టైటిల్‌ను పెట్టాలని మేకర్స్ భావిస్తున్నారని టాక్ బలంగా వినిపిస్తోంది. కాగా.. ఈ సినిమాలో నాగ చైతన్య జాలరి పాత్రలో కనిపించబోతున్నారు. అందు కోసం చైతన్యతో పాటు దర్శకుడు చందు మొండేటి, నిర్మాత బన్నీ వాసు.. మూడు నాలుగు రోజుల పాటు వైజాగ్ వెళ్లి, అక్కడ మత్స్యకారులను కలిసి వారినడిగి కొన్ని వివరాలను తెలసుకున్నారట.
చైతన్య, చందు కాంబోలో ఇది వరకు వచ్చిన రెండు సినిమాల్లో ప్రేమమ్ మంచి విజయాన్ని సాధించగా, సవ్యసాచి డిజాస్టర్ మూవీగా నిలిచింది. త్వరలోనే ఈ మూవీలో హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఫిక్స్ అవుతారు. తర్వాతనే సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడుతుందని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. మరో వైపు చైతన్య వెబ్ సిరీస్ దూత కూడా సన్నద్ధమవుతుంది.