English | Telugu
‘అర్జున్ రెడ్డి’ కాంబోపై కన్నేసిన నిర్మాతలు!
Updated : Aug 31, 2023
తెలుగు సినీ ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి సినిమా సాధించిన సంచలన విజయాన్ని ఎవరూ మరచిపోలేరు. విజయ్ దేవరకొండను స్టార్ హీరోగా నిలబెట్టిన సదరు సినిమాతో సందీప్ రెడ్డి వంగా దర్శకుడిగా తన సత్తాను చాటారు. అదే సినిమాను ఆయనే బాలీవుడ్‌లో రీమేక్ చేసి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ కొట్టారు. ఈ మూవీ తర్వాత మళ్లీ విజయ్ దేవరకొండ, సందీప్ వంగా కలిసి పని చేయలేదు. అయితే ఈ క్రేజీ కాంబినేషన్‌లో మరో సినిమా వస్తే ఎలా ఉంటుందా? అని అభిమానులు, ప్రేక్షకులు, సినీ సర్కిల్స్ అనుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఆసక్తికరమైన వార్తొకటి నెట్టింట వైరల్ అవుతోంది.
అదేంటంటే.. ప్రస్తుతం టాలీవుడ్‌లో భారీ చిత్రాలను నిర్మిస్తోన్న సంస్థల్లో మైత్రీ మూవీ మేకర్స్ ఒకటి. వీరు మాత్రం ‘అర్జున్ రెడ్డి’ కాంబోని సెట్ చేయాలనుకుంటున్నారట. అన్ని కుదిరితే వీరి కలయికలో తామే ఓ సినిమాను నిర్మిస్తామని, వీరిద్దరూ సాఫ్ట్ జోనర్ మూవీ మాత్రం చేయరని వారు చెబుతున్నారు. విజయ్ దేవరకొండ డేట్స్ అయినా ఇప్పుడు దొరకవచ్చునేమో కానీ సందీప్ రెడ్డి వంగా డేట్స్ దొరకటం కష్టంగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం రణ్‌భీర్ కపూర్‌తోయానిమల్ సినిమా చేస్తోన్న ఆయన తర్వాత ప్రభాస్‌తో స్పిరిట్ మూవీ చేయాల్సి ఉంది. అది పూర్తవగానే అల్లు అర్జున్‌తో ఓ సినిమాను తెరకెక్కించాల్సి ఉంది. ఇవి పూర్తి కావాలంటే కనీసం రెండేళ్లు అయినా పడుతుంది మరి.
ఇక విజయ్ దేవరకొండ విషయానికి వస్తే లైగర్ ఫ్లాప్ తర్వాత ఆయన ఖుషి సినిమాతో ప్రేక్షకులను పలకరించటానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 1న రిలీజ్ అవుతుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో సమంత హీరోయిన్‌గా నటించింది.