English | Telugu
‘స్కంద’ చిత్రానికి రికార్డు స్థాయిలో బిజినెస్!
Updated : Aug 31, 2023
రామ్, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందున్న ‘స్కంద’ చిత్రం సెప్టెంబర్ 15న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి బడ్జెట్ 100 కోట్లు అయిందని తెలుస్తోంది. అయితే రామ్‌కు అంత మార్కెట్ ఉందా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే అతను గతంలో చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ 40 కోట్లు. బోయపాటి శ్రీను గత చిత్రం ‘అఖండ’ బడ్జెట్ 70 కోట్లు. నందమూరి బాలకృష్ణతోనే 70 కోట్లతో సినిమా చేసిన బోయపాటి... రామ్ సినిమాకి మాత్రం బడ్జెట్ పెంచాడు. అయితే అందిన సమాచారం మేరకు ఈ సినిమాకి బిజినెస్‌పరంగా బాగానే వర్కవుట్ అయినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారానే 98 కోట్లు రాబట్టినట్టు సమాచారం.
తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషలకు సంబంధించిన శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్‌ను స్టార్ నెట్‌వర్క్ 54 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది. ఈ నాలుగు భాషల్లో ‘స్కంద’ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతాయి. స్టార్ ఛానల్స్‌లో సినిమా ప్రసారం అవుతుంది. జీ స్టూడియోస్ సంస్థ ఈ సినిమాకి భాగస్వామి కూడా కావడంతో హిందీ వెర్షన్ శాటిలైట్, ఓటీటీ, థియేట్రికల్ రైట్స్ కోసం ఆ సంస్థ 35 కోట్లు చెల్లించింది. తీసుకుంది. ఇక ఆడియో రైట్స్ ద్వారా మరో రూ.9 కోట్లు వచ్చాయి. ఈ బడ్జెట్‌కి ఇంత పెద్ద మొత్తంలో అన్నిరకాల రైట్స్ ద్వారా రావడం మామూలు విషయం కాదు. అలాగే థియేట్రికల్ రైట్స్ ద్వారా మరో 50 కోట్ల రూపాయల వరకు సంపాదించారు. ఎలా చూసినా ‘స్కంద’ చిత్ర నిర్మాత శ్రీనివాసా చిట్టూరికి లాభమనే చెప్పాలి. పైగా బోయపాటి శ్రీను గత చిత్రం ‘అఖండ’ ఘనవిజయం సాధించడంతో సినిమాపై ఎక్కువ హోప్స్ ఉన్నాయి.