English | Telugu
పాన్ ఇండియా మూవీలో మీనాక్షి చౌదరికి ఛాన్స్!
Updated : Sep 14, 2023
దక్షిణాదిన తన సత్తా చాటటానికి రెడీ అవుతోన్న మరో ఉత్తరాది భామ.. మీనాక్షి చౌదరి. అప్ స్టెర్స్ అనే హిందీ చిత్రంతో కెరీర్ ప్రారంభించింది. కానీ నార్త్ వాళ్లు చిన్న చూపు చూశారు. అదే సమయంలో ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. తర్వాత 2022లో వచ్చిన ఖిలాఢి, హిట్ సినిమాలు అమ్మడుకి మంచి గుర్తింపును తెచ్చి పెట్టాయి. ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘గుంటూరు కారం’ సినిమాలో కథానాయికగా మెప్పించనుంది. నిజానికి ఈ సినిమాలో ముందుగా పూజా హెగ్డే, శ్రీలీలను హీరోయిన్స్‌గా అనుకున్నారు. అయితే చివరి నిమిషంలో పూజా హెగ్డే తప్పుకుంది. దాంతో పూజా హెగ్డే రోల్‌లోకి శ్రీలీలను తీసుకున్నారు. శ్రీలీల రోల్ చేయటానికి మీనాక్షి చౌదరి ఎంపిక చేసుకున్నారు.
నిజానికి ‘గుంటూరు కారం’ సినిమాలో మీనాక్షి చౌదరి నటించటం అనేది ఆమెకు నిజంగా ప్లస్ పాయింటే. ఇది కాకుండా ఈ బ్యూటీ డాల్‌కి మరో గోల్డెన్ ఛాన్స్ వచ్చిందనే వార్తలు సినీ సర్కిల్స్‌లో గట్టిగా వినిపిస్తున్నాయి. అవేంటంటే, దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తోన్న ఓ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా ఎంపకైంది. ఇది పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుంది. లక్కీ భాస్కర్ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాకు తొలి ప్రేమ, సార్ చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించబోతున్నారు.
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ పోర్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జి.వి.ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. సీతారామం వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత తెలుగు దర్శకుడితో దుల్కర్ సల్మాన్ నటిస్తోన్న సినిమా ఇది. అలాగే సార్ వంటి హిట్ మూవీ తర్వాత వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్న చిత్రమిది.