English | Telugu
జయప్రదకు షాకిచ్చిన కోర్టు... జైలు శిక్ష తప్పేలా లేదు!
Updated : Oct 21, 2023
సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు జయప్రద ఇప్పుడు అడపా దడపా సినిమాల్లో కనిపిస్తుంటారు. ఈమెకు మద్రాస్ హైకోర్టులో ఊహించని షాక్ తగిలింది. అసలేమైంది? అసలు జయప్రదపై కేసు వేసింది ఎవరు? ఏ కారణంతో కేసు వేశారు? దానికి మద్రాస్ హైకోర్టు ఎలా రియాక్ట్ అయ్యింది? అనే వివరాల్లోకి వెళితే..జయప్రదకు చెన్నైలోని జనరల్ ప్యాటర్స్ రోడ్డులో ఓ థియేటర్ ఉంది. చెన్నైకి చెందిన రామ్ కుమార్, రాజబాబులతో కలిసి అన్నా నగర్‌లోని ఓ థియేటర్‌ను కూడా జయప్రద రన్ చేస్తున్నారు. అయితే ఈ థియేటర్స్ కారణంగానే జయప్రదకు చిక్కులు వచ్చాయి. ఈ థియేటర్‌లో వర్క్ చేస్తున్న కార్మికుల నుంచి ఈఎస్ఐ సొమ్ముని వసూలు చేసినప్పటికీ దాన్ని ప్రభుత్వానికి చెల్లించటం లేదంటూ ఓ ఉద్యోగి స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌పై ఫిర్యాదు చేశారు.
ఈ వివాదంపై విచారణ చేపట్టిన చెన్నై ఎగ్మోర్ మేజిస్ట్రేట్ కోర్టు జయప్రదతో పాటు ఇద్దరు భాగస్వామ్యులకు కూడా ఆరు నెలల పాటు జైలు శిక్షని విధించింది. దీనిపై హై కోర్టుకి వెళ్లిన జయప్రద తన నేరాన్ని అంగీకరించటంతో పాటు ఉద్యోగస్తుల బకాయిలు చెల్లిస్తానని, కేసు ఎత్తి వేయాలని కోరింది. అయితే హైకోర్టు అందుకు అంగీకరించలేదు. అంతే కాకుండా వచ్చే 15 రోజుల్లో కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలన్నారు. 20 లక్షల పూచీకత్తుతో బెయిల్ పొందాలని కూడా కోర్టు సూచించింది.
80 దశకంలో దక్షిణాదితో పాటు ఉత్తరాది సినిమాల్లో నటించి మెప్పించారు జయప్రద. రాజ్యసభ సభ్యురాలిగానూ ఎన్నికయ్యారు. అయితే ఇప్పుడు ఆమెను సమస్యలు వెంటాడుతున్నాయి. ఇప్పుడు మద్రాస్ హైకోర్టు చెప్పినట్లు వినకపోతే జయప్రదకు జైలు శిక్ష తప్పేలా లేదు.