English | Telugu
మళ్లీ ఆ డైరెక్టర్‌కి ధనుష్ ఛాన్స్!
Updated : Aug 21, 2023
దక్షిణాదితో పాటు ఉత్తరాది ప్రేక్షకులకు సుపరిచితులైన హీరోల్లో ధనుష్ ఒకరు. చకచకా సినిమాలను పూర్తి చేయటమే కాదు.. విలక్షణమైన సినిమాలు చేయటంలోనూ ఆయన ఎప్పుడూ ముందుంటారు. అంతే కాదు.. ధనుష్ బహుముఖ ప్రజ్ఞాశాలి. పాటలు రాస్తారు, పాడుతారు. సినిమాలకు స్క్రీన్ ప్లే అందిస్తారు, డైరెక్ట్ కూడా చేస్తుంటారు. సినిమాలను నిర్మిస్తుంటారు కూడా. ఆయన వండర్ బార్ ఫిలిమ్స్ బ్యానర్‌ను స్టార్ట్ చేసి అందులో సినిమాలను నిర్మిస్తుంటారు. ధనుష్ కంటిన్యూగా సినిమాలు చేయటానికి ఆసక్తి చూపే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో ఇప్పుడు అరుణ్ మాదేశ్వరన్ కూడా చేరారు.
ప్రస్తుతం ధనుష్ 49వ సినిమా కెప్టెన్ మిల్లర్‌ను అరుణ్ మాదేశ్వరన్ తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ధనుష్ 51వ సినిమా తెరకెక్కబోతున్న ఈ మూవీలో ధనుష్ కి జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది. తర్వాత మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ధనుష్ సినిమా ఉంటుంది. బాలీవుడ్ డైరెక్టర్ ఆనంద్ ఎల్.రాయ్ సినిమా లైన్‌లో ఉంది.
కెప్టెన్ మిల్లర్ సినిమా విషయానికి వస్తే 1930-40 బ్యాక్ డ్రాప్‌లో నడిచే పీరియాడిక్ మూవీ ఇది. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడే వ్యక్తిగా ధనుష్ కనిపించనున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీలో కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ కీలక పాత్రలో మెప్పించబోతున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 15 తర్వాత విడుదల చేసే అవకాశం ఉందని చిత్ర వర్గాల సమాచారం.
ప్రస్తుతం ధనుష్ తన 50వ సినిమాను డైరెక్ట్ చేస్తూ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన గుండుతో కనిపించబోతున్నారనే సంగతి తెలిసిందే.