English | Telugu
‘బేబి’ నిర్మాతలకు పోలీసుల నోటీసులు...డ్రగ్స్ లింకేంటి?
Updated : Sep 15, 2023
కొన్నిసార్లు ఎవరో చేసిన తప్పులకు మరెవరో టార్గెట్ అవుతుంటారు. ఇప్పుడు బేబి సినిమా మేకర్స్ పరిస్థితి అలాగే ఉంది. రీసెంట్ టైమ్‌లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అంతా బాగుందని అనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ మూవీ ప్రొడ్యూసర్స్‌కు హైదరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అసలు ఈ సినిమాకు, హైదరాబాద్ పోలీసులు ఎందుకు నోటీసులు జారీ చేశారు. అసలేం జరిగిందనే వివరాల్లోకి వెళితే, హైదరాబాద్‌లో డగ్ర్స్‌ను అమ్ముతున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ముగ్గురు నైజీరియన్స్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కమీషనర్ ఆఫ్ పోలీస్ సీవీ ఆనంద్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా బేబి సినిమా నిర్మాతలకు నోటీసులను అందించనున్నట్లు ఆయన పేర్కొనటం హాట్ టాపిక్‌గా మారింది.
‘‘హైదరాబాద్‌లో డ్రగ్స్ అమ్ముతున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో ముగ్గురు నైజీరియన్స్ కూడా ఉన్నారు. వీరొక ఆర్గనైజేషన్‌లా ఏర్పడి ఈ పని చేస్తున్నారు. వీసా గడువు పూర్తయినప్పటికీ నైజీరియన్స్ ఇక్కడే ఉండి డ్రగ్స్ అమ్ముతున్నారు. సోషల్ మీడియా ద్వారా ఈ లావాదేవీలు జరుగుతున్నాయని తెలిసింది. మాజీ పార్లమెంట్ సభ్యుడి కుమారుడు దేవరకొండ సురేష్ రావును కూడా అరెస్ట్ చేశాం. ఈ మధ్య కాలంలో విడుదలైన బేబి సినిమాలో డ్రగ్స్‌ను ఏవిధంగా ఉపయోగించాలనే విషయాలను చూపించారు. ఇలాంటి విషయాలను చూపించద్దని సినీ పరిశ్రమను కోరుతున్నాను. అందువల్ల ఆ సినీ నిర్మాతలకు నోటీసులు ఇస్తాం. ప్రతీ సినిమాను ఇకపై పోలీసులు ప్రత్యేకంగా గమనిస్తుంటారు. ఇలాంటి పనులు చేస్తూ బెంగుళూరు 18 మంది నైజీరియన్స్ ఉన్నారు’’ అని ఆయన తెలిపారు.
అయితే ఈ విషయంపై దర్శక నిర్మాత సాయి రాజేష్ స్పందించారు. సినిమా మేకింగ్ లో బాధ్యతగా ఉంటున్నామని అన్నారాయన. యువత డ్రగ్స్ వలలో పడొద్దని, మాదక ద్రవ్యాల బారిన పడితే తిరిగి బయటకు రాలేరని ఆయన తెలిపారు. బేబి సినిమాలో కథానుసారం రెండు పాత్రల మధ్య డ్రగ్ తీసుకున్న సన్నివేశాలు ఉన్నాయని, అయితే వాటిని థియేటర్ , ఓటీటీలో ప్రదర్శించినప్పుడు చట్టబద్ధమైన హెచ్చరిక ఇచ్చామని ఆయన పేర్కొన్నారు.