English | Telugu
కొత్త బిజినెస్ షురూ చేసిన నాగ చైతన్య!
Updated : Sep 15, 2023
అక్కినేని ఫ్యామిలీ నేటి తరం హీరోల్లో ఒకరైన నాగ చైతన్య సినిమాలకే పరిమితం కావాలనుకోవటం లేదు.. కావటం లేదు కూడా. ఆయన సినిమాల్లో వచ్చిన డబ్బులను ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులుగా పెడుతున్నారు. సినిమాలు కాకుండా ఇప్పటికే హోటల్ బిజినెస్‌ను స్టార్ట్ చేసిన నాగచైతన్య ఇప్పుడు కొత్త వ్యాపారాన్ని షురూ చేశారు. ఆ బిజినెస్ ఏదో కాదు.. మోటార్ రేసింగ్ గేమ్. నాగ చైతన్యకు సినిమా హీరో కాక ముందు నుంచే కార్స్, బైక్స్ అంటే పిచ్చి. కొత్త కారు మార్కెట్‌లోకి వచ్చిందంటే దానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేదాక ఆయన నిద్రపోరు. ఇదే విషయాన్ని దుల్కర్ సల్మాన్ ఓ సందర్భంలో స్టేజ్‌పై కూడా చెప్పారు.
అదే ఉత్సాహంతో ఇప్పుడు చైతన్య మోటార్ రేసింగ్ బిజినెస్‌ను స్టార్ట్ చేస్తున్నారు. అందులో భాగంగా హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ రేసింగ్ టీమ్‌ను ఆయన తన సొంతం చేసుకున్నారు. అఖిల్ రవీంద్ర, నీల్ జానీ ఇందులో డ్రైవర్స్‌గా పని చేయనున్నారు. మోటార్ స్పోర్ట్స్‌లో భాగం కావాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నానని, ఆ కల ఇప్పటికి నేరవేరిందని చైతు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ ఏడాది ఫార్ములా 4 ఇండియన్ ఛాంపియన్ షిప్‌లో చైతుకు చెందిన బ్లాక్ బర్డ్స్ రేసింగ్ టీమ్ పార్టిసిపేట్ చేయనుంది.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం నాగచైతన్య, చందూ మొండేటి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుంది. సెప్టెంబర్ 20 నుంచి ఈ సినిమా షూటింగ్ రెగ్యులర్‌గా జరగనుంది. ఈ చిత్రానికి తండేలు అనే టైటిల్ ప్రచారంలో ఉంది. సవ్యసాచి సినిమా తర్వాత చైతు, చందు కాంబోలో రానున్న సినిమా ఇది. గీతా ఆర్ట్స్ సంస్థ మూవీని నిర్మిస్తోంది. చేపలు పట్టేవాళ్లు అనుకోకుండా సరిహద్దులు దాటి పాకిస్థాన్‌లోకి వెళ్లటం అక్కడ అరెస్ట్ కావటం జరుగుతుంటాయి. అలా పాకిస్థాన్‌కు చిక్కిన ఓ జాలరి కథాంశంతో తండేలు సినిమా తెరకెక్కుతుందని టాక్ వినిపిస్తోంది.