English | Telugu
సర్జరీ చేస్తుండగా ప్రాణాలు కోల్పోయిన హీరోయిన్!
Updated : Nov 9, 2023
సినిమా హీరోయిన్ కావాలనుకునేవారు, ఆల్రెడీ హీరోయిన్‌గా కొనసాగుతున్న వారు తమ అందాన్ని కాపాడుకోవడానికి ఎన్ని కష్టాలు పడతారో మనకు తెలిసిందే. ఎందుకంటే టాలెంట్ కంటే ముందు అందం ఇంపార్టెంట్ అని వారి ఉద్దేశం. టాలెంట్ ఎంత ఉన్నా ఆకర్షణీయంగా కనిపించకపోతే అవకాశాలు కూడా రావు అని భావిస్తుంటారు హీరోయిన్లు. కొంతమంది ఒక అడుగు ముందుకు వేసి అందం పెరిగేందుకు సర్జరీలు చేయించుకుంటారు. అయితే ఈ విషయంలో కొందరిని దురదృష్టం మృత్యువు రూపంలో వెంటాడుతుంది. సర్జరీ వికటించి ప్రాణాలు కోల్పోతారు. తాజాగా అలాంటి ఘటనే ఓ హీరోయిన్ విషయంలో జరిగింది. సర్జరీ చేస్తుండగా నాలుగు సార్లు కార్డియాక్ అరెస్ట్ అవ్వడంతో ప్రాణాలు కోల్పోయింది. అమెరికాలోని సావోపాలోకు చెందిన 29 ఏళ్ల లూనా ఆడ్రెడ్ హాలీవుడ్ సినిమాల్లో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటోంది. ఇంకా మంచి ఆఫర్స్ రావాలంటే తన అందం మరింత పెరగాల్సిన అవసరం ఉందని భావించిన లూనా కాస్మటిక్ సర్జరీ చేయించుకునేందుకు సిద్ధపడిరది. సర్జరీ జరుగుతున్న సమయంలో ఒకసారి కార్డియాక్ అరెస్ట్‌కి గురైంది. డాక్టర్లు మళ్ళీ ఆమెను మామూలు స్థితికి తీసుకొచ్చి ఊపిరి పీల్చుకున్నారు. అయినా మరి కొద్దిసేపటికి మూడుసార్లు కార్డియాక్‌కి గురైంది. ఆమెను రక్షించేందుకు డాక్టర్లు విశ్వ ప్రయత్నం చేశారు. కానీ, లాభం లేకపోయింది. ఆమె ప్రాణాలు కాపాడలేకపోయారు. లూనా మరణ వార్త అక్కడి చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది.
మనదేశంలోనూ అందం కోసం సర్జరీలు చేయించుకున్న హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. దివంగత శ్రీదేవి, సమంత, శృతిహాసన్, జాన్వీ కపూర్.. ఇలా సర్జరీలు చేయించుకున్న వారిలో ఉన్నారు. ఇక కొందరు బరువు తగ్గేందుకు లైపోసక్షన్ చేయించుకుంటూ ఉంటారు. అలా లైపోసక్షన్ సర్జరీ జరుగుతుండగా హీరోయిన్ ఆర్తి అగర్వాల్ మరణించిన విషయం తెలిసిందే. కాస్మటిక్ సర్జరీ కానీ, లైపో సక్షన్ సర్జరీ కానీ అందరికీ సక్సెస్ అవ్వవని, కొందరి విషయంలో వికటించి ప్రాణాల మీదకు వస్తోందని తెలిసినా సర్జరీలు చేయించుకునే వారి సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పుడున్న పోటీ ప్రపంచం అలాంటిది. ఎదుటివారి కంటే తను అందంగా కనిపిస్తే అవకాశాలు పెరుగుతాయనే నమ్మకమే.. ప్రాణాంతకమైనా సర్జరీల వైపు వారిని పరుగులు తీసేలా చేస్తోంది.