English | Telugu
రజినీకాంత్ కొత్త సినిమా హార్డ్ డిస్క్ గల్లంతు.. టెన్షన్‌లో యూనిట్!
Updated : Nov 9, 2023
‘జైలర్’ బ్లాక్‌బస్టర్ హిట్ సాధించడంతో సూపర్‌స్టార్ రజినీకాంత్ మంచి ఊపు మీద ఉన్నారు. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తోంది. ఇదిలా ఉంటే మరో పక్క తన కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో రూపొందుతున్న ‘లాల్ సలామ్’ చిత్రంలో రజినీ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్నందిస్తున్నాడు. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ సినిమా బాలీవుడ్ హిట్ సినిమా ‘కైపోచే’ రీమేక్ అని తెలుస్తోంది. ఈ సినిమాలో రజినీకాంత్ మెయిదీన్ భాయ్‌గా ఓ పవర్‌ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు. రజినీకాంత్‌కి భార్యగా నిరోష నటిస్తోంది.
రజినీ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ఎంతో ప్రెస్టీజియస్‌గా రూపొందిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే.. రజినీకాంత్ నటించిన సీన్స్‌కి సంబంధించిన హార్డ్ డిస్క్ మాయమైందట. ఎంతో భద్రంగా దాచిన ఆ హార్డ్ డిస్క్ కనిపించకుండా పోవడంతో చిత్ర యూనిట్ ఆందోళన చెందుతోంది. ఇప్పుడు ఆ హార్డ్‌డిస్క్ ఎక్కడ ఉందో కనిపెట్టే పనిలో పడిరది యూనిట్. ఆ హార్డ్ డిస్క్ లభించకపోతే రజినీ సీన్స్‌ను రికవరీ చేసేందుకు విదేశాల నుంచి టెక్నీషియన్స్‌ను రప్పించేందుకు మేకర్స్ సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.
ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చెయ్యాలని ముందుగా ప్లాన్ చేసుకున్నారు. అయితే ఈ ఘటన వల్ల సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. త్వరలోనే సినిమా రిలీజ్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సంక్రాంతి బరిలో ఐశ్వర్య రజనీకాంత్ ‘లాల్‌సలామ్’, శివకార్తికేయన్ ‘అలయాన్’, జయం రవి ‘సైరన్’ ఉన్నాయి. ఇప్పుడు ‘లాల్ సలామ్’ పోటీ నుంచి తప్పుకునే అవకాశాలు ఉండడంతో, రెండు సినిమాలు పోటీలో మిగిలాయి.