అభిమానుల బలహీనతే పెట్టుబడిగా సాగుతున్న ఐపీయల్

 

ఐపీయల్ మ్యాచులు మన క్రికెట్ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయమని దేశంలో క్రికెట్ అభిమానులు అందరూ చాలా సంతోషించారు. వివిధ దేశాలకు చెందిన తమ అభిమాన క్రికెట్ ఆటగాళ్ళను అందరూ కలిసి ఆడుతుంటే వారికి అదో పండుగే అయింది. దానికి సినీరంగం, చీర్ గర్ల్స్ గ్లామర్ కూడా తోడవడంతో వారి సంబరానికి అంతే లేదు. చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురయినప్పటికీ, అటు క్రికెట్ అభిమానులకు ఆనందం, ఇటు క్రికెట్ బోర్డుకి, ఆటగాళ్లకి కాసుల వర్షం కురిపిస్తూ ఐపీయల్ ఇంతవరకు సజావుగా సాగిపోయింది.

 

అయితే, శ్రీశాంత్, అజయ్, అంకిత్ ముగ్గురూ స్పాట్ ఫిక్సింగ్ కేసులో పట్టుబడటంతో, క్రికెట్ అభిమానులకి తమ కళ్ళ ముందు జరుగుతున్న ఆట నిజమయిన ఆట కాదని తెలిసి దిగ్బ్రాంతి చెందారు. ఆ వెంటనే, చెన్నై సూపర్ కింగ్స్ యజమాని గురునాథ మయప్పన్, రాజస్తాన్ రాయల్స్ యజమానులు అయిన బాలివుడ్ నటి శిల్పా శెట్టి ఆమె భర్త రాజ్ కుంద్రా కూడా ఐపీయల్ పై బెట్టింగ్ చేస్తూ దొరికిపోయారు. ఇక, ఇండియన్ టీం క్యాప్టెన్ మహేందర్ సింగ్ ధోనీ కూడా రితీ స్పోర్ట్స్ అనే వ్యాపార సంస్థలో వాటాలు కలిగి నలుగురు ఆటగాళ్ళను ముందుగానే ఫిక్స్ చేసుకోవడం మరింత అనుమానాలకు రేకెత్తించింది.

 

ఈ మొత్తం వ్యవహారలన్నిటినీ కూడా ఎక్కడో దుబాయ్ లో కూర్చొన్న దావూద్ ఇబ్రహం వంటి సంఘ వ్యతిరేఖ శక్తులు నియంత్రిస్తుండటం కొసమెరుపు. ప్రజల క్రికెట్ అభిమానాన్నిఒక బలహీనతగా గుర్తించిన సదరు శక్తులన్నీ కలిసి వారితో ఈవిధంగా ఆడుకోవడం ఆరంబించాయి. అప్పుడు అభిమానులకు తాము ప్రోత్సహిస్తున్నది క్రికెట్ ఆటనా లేక వ్యాపారన్నా లేక జూదాన్నా అనే ప్రశ్నతలెత్తింది. తమ విలువయిన సమయాన్ని కష్టార్జితాన్నిపణంగాపెట్టి వారందరూ కలిసి ఆడుతున్న ఈ ఐపీయల్ మ్యాచులలో తామే అందరి కంటే ముందు క్లీన్ బౌల్డ్ అయిపోయామని అర్ధం చేసుకొని వారు నివ్వెర పోయారు.

 

జంటిల్ మ్యాన్ గేం అని చెప్పబడుతున్న క్రికెట్ ఆట వెనుక ఇన్ని దుష్ట శక్తులు, కుట్రలు, కుతంత్రాలు ఉన్నట్లు తెలిసిన తరువాత కూడా ఆ ఆటలో ఆనందం వెత్తుకోవాలని చూస్తే అది తమ బలహీనతకు మరో మారు లొంగిపోవడమే కాకుండా అటువంటి సంఘ విద్రోహ శక్తులకు పరోక్షంగా తమ మద్దతు తెలిపినట్లే అవుతుందని చాలా మంది క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారిప్పుడు.

 

ఈ ఐపీయల్ మ్యాచుల వల్ల దేశానికి ఖ్యాతి, ఆదాయం రాకపోగా ఉన్నపరువు గంగలో కలిసిపోయి, సొమ్ములు విదేశాలకు తరలిపోతున్నాయి. నేడు ఈ మ్యాచులలో కొందరు సినీతారలు ప్రత్యక్షంగా పాల్గొంటే, సాక్షాత్ బీసీసీఐ బోర్డు అధ్యక్షుడు శ్రీనివాసన్, ఆయన అల్లుడు మేయప్పన్, విందూ సింగ్, దావూద్ ఇబ్రహీం వంటి వారందరూ తెర వెనుక నిలబడి కధను నడిపిస్తున్నారు. ఇవి కేవలం ఇంత వరకు బయటపడిన కొన్ని పేర్లు మాత్రమే. ఇంకా ఈ వ్యవహరంలో ఎన్ని పెద్ద తలకాయలున్నాయో ఎవరికీ తెలియదు. స్విస్ బ్యాంకులని కూడా తమ అవినీతి సంపాదనతో నింపి పడేసిన మన రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తలు కోట్లు కురిపిస్తున్న ఈ ఐపీయల్ మ్యాచ్చులకి దూరంగా ఉంటారని మనం భావించనవసరం లేదు. ఎంత పెద్ద అవినీతో భాగోతానయినా అవలీలగా కప్పి పుచ్చగల సమర్దులయినవారు తమ పేర్లు బయటపడకుండా పైకి కొందరి బొమ్మలే కనిపించేలా తగిన జాగ్రత్తలు తీసుకొనే ఉంటారు.

 

ఇక, ఇటువంటి అనైతిక ఆటలో తానూ భాగస్వామిని కాలేనని గౌరవంగా తప్పుకొన్న క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ని ఆదర్శంగా తీసుకొని ఆయన అభిమానులు కూడా ఈ ఐపీయల్ మ్యాచులుకి దూరంగా ఉంటే మేలేమో. ఇంత ఘోరంగా మోసం చేసిన ఐపీయల్ మ్యాచులు ఇప్పుడు వారికి ‘ఐ-ఓపెనర్’ అయ్యాయి.