విషాదం మిగిల్చిన ప్రకృతి విలయ తాండవం
posted on Jun 22, 2013 @ 11:43AM
నిన్నమొన్నటివరకు ఉత్తరాఖండ్ రాష్ట్రం పర్యాటకుల పాలిట స్వర్గధామం. దేశంలో ఎక్కడెక్కడి నుండో ప్రజలు వ్యయప్రాయసలకోర్చి అక్కడికి చేరుకొని ఒక జీవితానికి సరిపడే మధురానుభూతులు మూటగట్టుకొని మరలివస్తుంటారు. ఇక, అక్కడ ఉన్న అత్యంత ప్రాచీనమయిన కేదార్ నాథ్ మందిరం ప్రపంచ వ్యాపతంగా ఉన్న హిందువులందరికీ పరమ పావనమయిన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. అటువంటి సుందర ప్రదేశం ప్రకృతి విలయతాండవంతో పర్యాటకులకు జీవితంలో మరచిపోలేని పీడకలలు మిగిల్చింది.
ముక్కంటి నెలవున్న కేధార్ నాథ్ మందిర ప్రాంగాణమంతా భక్తుల శవాలతో నిండిపోయి నేడు మరుభూమిగా మారిపోయింది. ఈ ఘోర విపత్తులో అధికారికంగా వందల మంది చనిపోయినట్లు చెప్పబడుతుంటే, అక్కడ చిక్కుకొన్న పర్యాటకులు, సహాయ కార్యక్రమాలలో పాల్గొంటున్నవారు చెప్పిన లెక్కల ప్రకారం కొన్నివేలమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కొన్ని వందల ఆశ్రమాలు, సత్రవులు, చిన్నా పెద్దా లాడ్జీలు, దాదాపు 60కి పైగా గ్రామాలు, 50కి పైగా చిన్నా పెద్దా వంతెనలు ఈ వరదలలో కొట్టుకుపోయాయంటే ప్రాణనష్టం అధికారిక లెక్కల కంటే చాల ఎక్కువేనని అర్ధం అవుతుంది. కేధార్ నాథ్ ఆలయం మరో రెండు సం.లు వరకు తెరువలేని పరిస్థితి అంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం అవుతుంది. అయితే, ఊళ్లకు ఊళ్ళు కొట్టుకుపోయినా, మందిరం చుట్టూ ఉన్న అనేక భవనాలు కూలిపోయినా, కేదార్ నాథ్ ఆలయం, అందులో మూల విరాట్టు, బయటనున్ననంది విగ్రహం మాత్రం చెక్కుచెదరక పోవడం దైవలీలే.
ఇక ఈ ఘోర విప్పతులో దాదాపు 60వేల మందికిపైగా వివిధ ప్రాంతాలలో చిక్కడిపోగా, అదృష్టవంతులయిన కొందరు మాత్రం, అయిన వాళ్ళనీ, ఆత్మీయులనీ పోగొట్టుకొని భారమయిన హృదయాలతో ఎలాగో ఇళ్ళకు చేరుకోగలుగుతున్నారు. ఆలా తిరిగొచ్చిన వారు, తమ బయనక అనుభవాలను వర్ణించిచెపుతుంటే, పగవాడికి కూడా అటువంటి కష్టం వద్దని కోరుకొంటాము. ప్రకృతితో చక్కగా అనుసంధానమయిన ఉత్తరాఖండ్ వంటి ప్రాంతమే ఇంత ఘోర విపత్తుకి నిలయమయితే, విచ్చలవిడిగా ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్న మన పట్టణాలు, నగరాలు ఎటువంటి ఘోర వైపరీత్యాలకు ఆహ్వానం పలకనుందో అని ఆలోచించడానికే భయం వేస్తుంది.